కరోనా కారణంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. కొద్దో గొప్పో కొలువుల్లో స్థిరపడిన వారు సైతం కింద పడిపోయారు. లాక్డౌన్తో అందరి పరిస్థితులు తలకిందులైపోయాయి. ప్రత్యేకంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రైవేటు పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ పాఠశాల యజమాని.. కౌలు రైతుగా మారి, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆత్మవిశ్వాసంతో బతుకు బండిని నడిపిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలిచారు.
పెద్దపెండేకల్ మహబూబ్‌పీరా బీకాం, బీఈడీ పూర్తి చేశారు. ఆదోనిలో ఆంగ్లమాధ్యమ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ సమయంలో పరిస్థితి తిరగబడింది. దీంతో బతుకు బండి గడవడం కష్టంగా మారింది. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ధైర్యంగా ముందుకు కదిలారు. ఆదోని మండలం సాదాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఓ రైతు నుంచి రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఎకరా పొలం రూ.6 వేల చొప్పున రెండు ఎకరాలకు రూ.12 వేలు కౌలు చెల్లించారు. రైతు కుటుంబం నుంచి రావటంతో వ్యవసాయంపై ఉన్న అనుభవంతో పత్తి సాగును ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి రోజూ ఉదయం పొలానికి వెళ్లి పనులు చేయడం, సాయంత్రం ఇంటికి రావడంతో అలవాటు చేసుకున్నారు. ఇప్పటి వరకు 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి తీయటంతో ఎకరాకు రూ.5 వేలు చొప్పున ఆదాయాన్ని గడించారు. కష్టానికి తగ్గట్టు దిగుబడి వస్తోంది. మరో మూడు, నాలుగు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.