Sankranti Sambaralu: సంక్రాంతి వస్తోందంటే చాలు చిన్నాపెద్దా ఎక్కడలేని ఉత్సాహం నెలకొంటుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా.. అంటూ సంక్రాంతి పాటలు పాడుకుంటారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిండి వంటలతో ఆనందంగా గడుపుతారు. అలాంటి పండగ విశేషాలను చిన్నారులకు తెలిపే ఉద్దేశంతో.. కర్నూలులోని ఓ పాఠశాల యాజమాన్యం ముందస్తు సంక్రాంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులు ఆనందంగా ఈ సంబరాల్లో ఆడిపాడారు.
అలరించిన విద్యార్థుల నృత్యాలు..
పాఠశాల ఆవరణలో భోగిమంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, హరిదాసులు అన్నింటినీ ఏర్పాటు చేశారు. పండగ 3 రోజులు ఎలా జరుపుకుంటారో అన్నింటిని చిన్నారులతో చేయించారు. సంక్రాంతి పాటలకు చిన్నారులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. పండగ ముందే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సంబరాల్లో ఎంతో ఆనందంగా గడిపామని విద్యార్థులు తెలిపారు.