ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్ని విధానాలు తెచ్చినా ఇసుక కష్టాలు తీరవా..! - కర్నూలు జిల్లాలో ఇసుక కష్టాలు

ప్రభుత్వాలు ఎన్ని కొత్త విధానాలు తెచ్చినా ప్రజలకు ఇసుక కష్టాలు తీరడం లేదు. ఆన్‌లైన్‌లో ఉంచిన కొద్దిసేపటికే నిల్వలు నిల్‌ అని చూపిస్తున్నాయి. ఇసుక ఇంటికి చేరడమంటేనే గగనమవుతోంది. రూ.వేలు ఖర్చు చేసి కొన్న ఇసుకలో నాణ్యత సరిగా లేకపోవడం, తూకం తగ్గడం వంటివి లబ్ధిదారులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను నదిలో తవ్వి నిర్మానుష్య ప్రదేశాల్లో నిల్వలు పెట్టి మరీ అమ్మకాలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు.

sand problems in kurnool district
ఇసుక కష్టాలు

By

Published : Jul 2, 2020, 10:17 AM IST

ప్రభుత్వాలు ఎన్ని కొత్త విధానాలు తెచ్చినా ప్రజలకు ఇసుక కష్టాలు తీరడం లేదు. కర్నూలు సమీపంలో ఉన్న పెద్దపాడు ఇసుక నిల్వ కేంద్రం నుంచి కర్నూలులోని ఎన్‌ఆర్‌పేటకు ఇసుక తీసుకెళ్లాలంటే బాడుగ గిట్టుబాటు కావడం లేదని ట్రాక్టర్‌ డ్రైవర్లు చెబుతున్నారు. 5 కిలోమీటర్ల లోపు దూరం ఉంటే కేవలం రూ.500 మాత్రమే బాడుగను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధర గిట్టుబాటు కావడంలేదని.. డీజిల్‌ ఖర్చు, డ్రైవర్‌ ఖర్చులకూ సరిపోవని చెప్తున్నారు. దీంతో పెద్దపాడు ఇసుక నిల్వ కేంద్రం నుంచి పాతబస్తీకి ఇసుక అవసరమైతే రూ.1800 ట్రాక్టర్‌ బాడుగ డిమాండ్‌ చేస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

నాణ్యమైన ఇసుక అక్రమార్కుల చెంతకు

తుంగభద్ర నదీ తీర గ్రామాల్లో రాత్రిళ్లు 9 గంటలకు మొదలు పెట్టి తెల్లవారు జామున 3 గంటల వరకు నదీ గర్భంలో యంత్రాలతో ఇసుక తోడేస్తున్నారు. ఇలా తోడిన ఇసుకను నిర్మానుష్య ప్రాంతాల్లో నిల్వలు చేస్తున్నారు. కౌతాళం నుంచి మంత్రాలయం, కోసిగి, నందవరం పరిధిలో ఈ దందా సాగుతోంది. కోసిగి పరిధిలోని తుమ్మిగనూరు వద్ద భారీ డంప్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇలా అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను స్థానికులకు ఆన్‌లైన్‌లో పడే ధరలకు విక్రయిస్తున్నారు.

డంపర్లలో ఇసుకను రూ.17 వేల నుంచి రూ.25 వేల వరకు డిమాండ్‌ను బట్టి అమ్ముతున్నారు. మధ్యలో ఎవరైనా అధికారులు ఆపితే సీసీరోడ్లు, గ్రామ సచివాలయ భవనాలు, ప్రభుత్వ నిర్మాణాలకంటూ అనుమతి పత్రాలు కొన్ని చూపిస్తూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేయగా.. ఇలాంటి నిల్వే వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారుల పేరిట రశీదు పొంది.. ఒక్క రశీదుపై 2, 3 టిప్పర్ల ఇసుకను అక్రమంగా నిల్వ చేయగా పోలీసులు పట్టుకోవడమే ఇందుకు తార్కాణం.

వే-బ్రిడ్జిల ఏర్పాటు పూర్తయితేనే!

ఇసుక స్టాక్‌ పాయింట్ల వద్ద వే-బ్రిడ్జిలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నదిచాగి, గుడికంబాలి, ఆళ్లగడ్డ, బనగానపల్లి, పెద్దపాడు వద్ద వే-బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మరో 9 మంజూరు చేయడంతోపాటు ఒక్కో నిర్మాణానికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తూ టెండర్లు పిలిచింది. నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈ వే-బ్రిడ్జిలు లేక ట్రాక్టరుకు నాలుగున్నర టన్నుల ఇసుక రావాల్సి ఉండగా, 4 టన్నుల లోపే అందుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు.

అలాగని నాణ్యతైనా బాగుంటుందా? అంటే 20 శాతం పైగా రాళ్లు, మట్టి పెళ్లలు కలిసి నాసిరకంగా ఉంటుందన్న ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. జూన్‌ 7వ తేదీ నుంచి ప్రతిరోజూ డీజిల్‌ ధరలు పెరుగుతూనే వచ్చాయి. లీటరుపై సుమారు రూ.10 పైగా పెరగినందున యాజమాన్యం రవాణా ఛార్జీలు పెంచేసింది. ఇలా ట్రాక్టర్లు ధరలు పెంచేయటంతో లబ్ధిదారులు 4 ట్రిప్పులు ట్రాక్టర్‌ కిరాయి బదులు ఒకేసారి 18 టన్నులు ఉండే డంపర్‌ని బుక్‌ చేసుకుంటున్నారు. ఫలితంగా ట్రాక్టర్‌ డ్రైవర్లకు ఉపాధి ఉండటం లేదు.

ప్రత్యామ్నాయంగా రాతి ఇసుకకు అనుమతిస్తే...

ప్రభుత్వ తవ్వకాలతోపాటు, అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఇసుక తరలిస్తున్నారు. దీంతో నాణ్యమైన ఇసుక నదిలో దొరకడం లేదు. లోతుగా తవ్వకాలు చేపడుతున్నందున జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ప్రభుత్వ నిర్మాణాలకు, ఇతరత్రా వాటికి రాతి ఇసుక 50%, నది ఇసుక 50% కలిపి వాడాలని ప్రభుత్వం ఆదేశాలిస్తే సమస్య తీరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తడి ఇసుకను విక్రయిస్తున్నారు

'ఇసుక రీచ్‌ దగ్గరే తడిగా ఉన్న ఇసుకను లారీలోకి లోడ్‌ చేస్తున్నారు. తూకం వేయకుండా కేవలం కొలతతో వేస్తున్నారు. మేం కట్టిన డబ్బుకి సరిపోయేంత ఇసుక ఇంటికి చేరడం లేదు. వచ్చిన ఇసుక నాణ్యత లేకుండా ఉంటుంది. గులక రాళ్లు అధికంగా ఉంటున్నాయి. జల్లెడ పట్టినప్పుడు అధికంగా పనికిరాకుండా పోతుంది. అధికారులు దృష్టి సారించి నాణ్యమైన ఇసుకను తూకం వేసి ఇచ్చేలా చూడాలి.' -- - వెంకటేష్‌, ఎమ్మిగనూరు

మరమ్మతులు చేయించేందుకు చర్యలు

'వినియోగదారులకు కచ్చితంగా తూకం వేసి ఇచ్చేందుకు ఇసుక నిల్వ కేంద్రాల వద్ద వేబ్రిడ్జిలను ఏర్పాటు చేశాం. అవినీతికి తావు లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు పెట్టాం. ఏమైనా సాంకేతిక సమస్య, మరమ్మతు వస్తే వాటిని గుర్తించి బాగు చేసి వినియోగంలోకి వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటాం. నంద్యాల, మూడుమాల, డోన్‌, పాణ్యం, ఆత్మకూరు, నందికొట్కూరులోని ఇసుక పంపిణీ కేంద్రాల వద్ద కొత్తగా వేబ్రిడ్జిలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. త్వరలో వేబ్రిడ్జిలు కట్టి నాణ్యత, తూకంలో అవినీతి లేకుండా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం'. - రాజశేఖర్‌, గనుల, భూగర్భ శాఖ సంచాలకులు

జిల్లాలో రీచ్‌లు

గంగవరం, గుడికంబాలి, నదిచాగి, శాతనకోట, ఈర్లదిన్నె, మూడుమాల, పల్‌దొడ్డి, రంగాపురం

స్టాక్‌ పాయింట్లు

కర్నూలు, ఎల్‌.పేట, డోన్‌, బనగానపల్లి, బేతంచర్ల, పాణ్యం, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ

ప్రతి రోజూ సరఫరా ఇసుక : 7-8 మెట్రిక్‌ టన్నులు

ఇవీ చదవండి...

ఆన్​లైన్​ బోధన.. ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు విద్యాసంవత్సరం

ABOUT THE AUTHOR

...view details