కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఓ యాచకుడు 2 లక్షల రూపాయలు పోగుచేశాడు. అతనికి సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తులు ఈ డబ్బును గుర్తించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను అనే వ్యక్తి... కొన్ని సంవత్సరాల క్రితం డోన్‌కు వచ్చాడు. పట్టణంలో బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగించేవాడు. బేతంచెర్ల సర్కిల్లోని మసీదు వద్ద దీన స్థితిలో ఉన్న శ్రీనును చూసి స్థానికులు ద్రోణాచలం సేవా సమితి ప్రతినిధులకు తెలియజేశారు.
సేవా సమితి సభ్యులు అక్కడికి చేరుకొని శ్రీనుకు స్నానం చేయించేందుకు ప్రయత్నించారు. అతను మొత్తం 12 చొక్కాలు వేసుకున్నాడని గమనించి వారు ఆశ్చర్యపోయారు. చొక్కాలను విప్పే క్రమంలో ఒక కవర్లో భారీగా నగదును గుర్తించారు. అందులో మొత్తం 2 లక్షలు రూపాయలు ఉన్నట్లు వారు తెలిపారు. అనంతరం సేవా సమితి వారు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.