నందికొట్కూరు ప్రధాన రహదారిని ఇరువైపులా 20-20అడుగులు వెడల్పు చేసేందుకు 2017లో శ్రీకారం చుట్టారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ కేఎల్‌ఎన్ రెడ్డి 2కి.మీ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులతో మాట్లాడారు. విస్తరణలో కోల్పోయిన దుకాణదారులు తిరిగి మళ్లీ షాపులు నిర్మించుకుంటే ఎలాంటి రుసుం వసూలు చేయబోమని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. సుమారు 800 దుకాణాలు కూల్చి విస్తరణ జరిగింది. జాతీయ రహదారి అధికారులు రోడ్లు వేయాల్సిన సమయంలో కొందరు పరిహారం ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కారు.
రహదారి విస్త'రణం'..నందికొట్కూరులో నాలుగేళ్లుగా నిలిచిన వైనం - Traffic Problems in Nandikotkur news
నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా కీర్తి కిరీటం పెట్టారే తప్ప అభివృద్ధి మాత్రం అటకెక్కింది. ప్రధానంగా రహదారులు విస్తరణకు నోచుకోక ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. పరిహారం కోసం కొందరు కోర్టు మెట్లెక్కడంతో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా నిత్యం ప్రమాదాల మాటున పడి లేస్తూ ఇంటికి చేరాల్సి వస్తోంది. ఇదీ కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ దుస్థితి.
ఫలితంగా నాలుగేళ్లుగా రహదారులు, డ్రైనేజీలు, డివైడర్ల ఏర్పాటు జరగలేదు. రహదారి మధ్య డివైడర్ల ఏర్పాటుకు రూ.2కోట్లు కేటాయించామని స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ ప్రకటించారు. కొత్తబస్టాండ్ నుంచి జమ్మిచెట్టు వరకు ఈ పనులు చేపట్టేందుకు నిర్ణయించినా అడుగులు పడలేదు. కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజూ 500కుపైగా భారీ వాహనాలు, 200 బస్సులు, కార్లు..ఆటో..ట్రాక్టర్లు వెయ్యికిపైగా తిరుగుతుంటాయి. ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో వాహనాలు ఢీకొని గాయాలపాలవుతున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కోర్టుకు వెళ్లిన కారణంగానే అభివృద్ధి ఆగిపోయిందని అధికారులు ఆరోపించడం సరికాదని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ... 'వాలంటీర్ల తొలగింపు ప్రచారం వాస్తవం కాదు'