Roads In Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని మొలగవల్లి - మద్దికెర మార్గం.. రోడ్ల దుస్థితికి అచ్చమైన ఉదాహరణగా నిలుస్తోంది. 14 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డుని ఒక్కసారిగా చూశామంటే.. ఈ దారిలో ప్రయాణం చేయలేం బాబోయ్ అనాల్సిందే. మొలగవల్లిలో మొదలైతే.. మద్దికెరలో ముగిసేదాకా.. అణువణువూ కంకర తేలి అత్యంత దారుణంగా ఉంటుందీ రోడ్డు. చాలాచోట్ల రోడ్డు కోతకు గురై.. నరకానికి నకలుగా మారింది. అందుకే గర్భిణులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ ప్రయాణానికి ఈ మార్గాన్ని అస్సలు ఎంచుకోరు. మిగిలిన వారు కూడా రోడ్డుపైన కాకుండా.. పక్కనున్న పొలాల మీదుగా రాకపోకలు సాగిస్తుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రోజువారీ పనులు, వైద్యం, ఇతర అవసరాల కోసం మొలగవల్లి నుంచి గుంతకల్లుకు వెళ్లే వారికి.. మద్దికెర వరకు ఉన్న రోడ్డు చుక్కలు చూపిస్తోంది. అందువల్ల ఈ మార్గం అంటేనే భయపడుతున్న కొందరు.. దాదాపు 24 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించేందుకూ సిద్ధమవుతున్నారు. మద్దికెర వెళ్లకుండా ఆలూరు, నగరడోన, రామదుర్గం, చిప్పగిరి మీదుగా గుంతకల్లు చేరుకుంటున్నారు.