కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న వారిలో 14 మంది మృత్యు ఒడికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం వద్ద హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 18 మంది ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
టెంపో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. క్రేన్ సాయంతో టెంపో వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాల వద్ద లభించిన ఆధార్‌కార్డులు, ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. మదనపల్లి నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ తెలిపారు. తెల్లవారుజామున 4.30గంటలకు ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
మదనపల్లె నుంచి వచ్చి మృతులను బంధువులు గుర్తించారు. ఇప్పటికే 3 మృతదేహాలకు శవపరీక్ష పూర్తి కాగా...వారిని స్వస్థలానికి తరలించారు. మరో 11 మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహిస్తున్నారు.
మృతులు వివరాలు
మృతులు: తల్లి నజీరా బీ (66), కుమారులు దస్తగిరి (48), రఫీ (30)
- కుమారుడు జాఫర్ వలీ (28), కుమార్తె నౌజియా (38)
- కోడళ్లు అమ్మాజాన్ (38), అమ్ములు (28), రోషిణి (25)