కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురు చిన్నారులతో పాటు మరో మహిళను బలి తీసుకొంది. శిరివెళ్ల మండలం జాతీయ రహదారిపై యర్రగుంట్ల వద్ద ఉదయం నాలుగున్నర సమయంలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం స్థానికంగా పెను విషాదం నింపింది. సుమారు 20 మంది రహదారి దాటేందుకు వేచి ఉండగా.. హఠాత్తుగా ఓ మినీ లారీ వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఝాన్సీ అనే 15 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సుస్మిత, వంశీ, హర్షవర్ధన్ అనే ముగ్గురు పిల్లలు నంద్యాల ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సువర్ణ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో 11 మంది గాయపడి, చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
క్రిస్మస్ సమీపిస్తున్న వేళ స్థానికంగా పలువురు ఆధ్యాత్మిక గీతాలతో ఉదయాన్నే దైవప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 16 మంది చిన్నారులు నలుగురు పెద్దవాళ్లతో కూడిన బృందం ఇవాళ కూడా బయలుదేరింది. అంతలోనే ఊహించని రీతిలో వారు ప్రమాదానికి గురయ్యారు.