River Pollution in Kurnool : స్వచ్ఛమైన, పాల నురగల్లాంటి నీటిని అందించే కృష్ణమ్మ.. కాలుష్యమయమైపోతోంది. ఎగువన కృష్ణా నది ఉపనదులైన తుంగభద్ర, హంద్రినివా.. కాలుష్య జలాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను మోసుకుని వస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయం కాలుష్య మయం అవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో పెను ముప్పు పొంచి ఉందని కర్నూలు ప్రజలు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. పరిరక్షించాల్సిన అధికారులే నదుల్లోకి మురుగునీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా కర్నూలు నగరంలోంచి ప్రవహించే తుంగభద్ర (Tungabhadra), హంద్రీ (Handri) నదులు.. కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి.
PRATHIDWANI: భారత నగరాల్లోని కాలుష్యంతో ప్రజారోగ్యానికి ముప్పు ఎంత?
కర్నూలుకు సమీపంలో తుంగభద్ర నది... నగరం మధ్యలో నుంచి హంద్రీ నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండూ కృష్ణానదికి ఉపనదులు. సహజ వనరులను సంరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో.. ఈ నదులు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. నగరంలోని మురుగు నీటిని ముందుగా శుద్ధి చేయకుండా ఈ రెండు నదుల్లో కలిపేస్తున్నారు. స్థానిక ప్రజలు చెత్త, వ్యర్థాలను సైతం ఇందులోనే కలిపేస్తుండటంతో.. మురికి కూపాలుగా మారుతున్నాయి.
ఈ నీటిని తాగే మూగజీవులు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఈ మురుగునీరంతా కృష్ణానదిలో కలిసి... శ్రీశైలం జలాశయం (Srisailam reservoir) లోకి చేరుతోంది. ఈ నీటిని తాగటం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకోవటమేనని నిపుణులు చెబుతున్నా... అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని నగరవాసులు వాపోతున్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాలు(Sewage treatment plants) ఏర్పాటు చేసి నదులు కలుషితం కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.