అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసులో కర్నూలు జిల్లా నంద్యాల కోర్టుకు హాజరైన సీఐ. సోమశేఖర రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వారిని కర్నూలు జైలుకు తరలించారు. నవంబర్ 3వతేదీన కుటుంబ సభ్యులతో కలిసి పాణ్యం మండలం కౌలూరు సమీపాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలో నిముసాంబిక జువెల్లర్స్లో నమ్మకంగా పనిచేసే సలాంకు ఆ దుకాణంలో గత ఏడాది జరిగిన మూడున్నర కిలోల బంగారు చోరీలో ప్రమేయం ఉందని పోలీసులు అరెస్టు చేశారు. కొంత బంగారంను ఆతని నుంచి రికవరీ చేశారు. ఆ కేసులో బయటకు వచ్చిన సలాం ఆటో డ్రైవర్గా కొనసాగుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో సలాం ఆటోలో ఓ ప్రయాణికుడి జేబులో నుంచి దొంగలు డబ్బు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ పోలీసులు ఆటో డ్రైవర్ సలాంను పిలిచి ప్రశ్నించారు.
ఈ విషయంలో పోలీసులు ఇబ్బందులకు గురిచేశారని మనస్థాపానికి గురై సలాం.. భార్య ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు కేసుల్లో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆత్మహత్యకు ముందు సలాం తీసిన సెల్ఫీ వీడియో నవంబర్ 5వ తేదీన బయటకు వచ్చింది. సీఐ. సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లు వేధించారని సలాం వాపోయారు. ఈ సంఘటన పై స్పందించిన ప్రభుత్వం... ఐజీ. నేతృత్వంలో విచారణ జరిపి సీఐ. హెడ్ కానిస్టేబుల్ను నవంబర్ 8న అరెస్టు చేశారు. నవంబర్ 9 న వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.