ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్లక్ష్యానికి నిదర్శనం.. ఈ రహదారి నిర్మాణం - కర్నూలు జిల్లాలో నిర్లక్ష్యంగా రహదారి నిర్మాణం వార్తలు

రహదారులు ప్రగతికి ప్రతీకలు.. సాఫీగా సాగిపోయే రాచబాటలు.. సామాజిక వైభవానికి దాఖలాలు. అలాంటి రహదారుల నాణ్యత రోడ్డున పడుతోంది. అడ్డగోలుగా నిర్మిస్తున్న తీరు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పర్యవేక్షణ కరవై జాప్యమవుతున్న పనులతో వాహనదారులకు నరకం చూపిస్తోంది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో లోపాలు ప్రస్ఫుటమవుతున్నాయి. అయినా గుత్తేదారుడిపై అధికారులు పెద్ద మనస్సు చేసుకున్నారు. ఫలితంగా ఆ రోడ్డులో ప్రయాణం కంటే నరకమే నయం అనేలా ఉన్న దుస్థితి.

Reckless road construction in kurnool district
నిర్లక్ష్యానికి నిదర్శనం.. ఈ రహదారి నిర్మాణం

By

Published : Oct 10, 2020, 12:57 PM IST

కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట నుంచి ఆదోని వరకు 55 కిలో మీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులను 2017లో రూ. 172 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఆలూరు నుంచి ఆదోని వరకు 26 కిలోమీటర్ల సిమెంట్ రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఇసుక కొరత, నీటి సమస్యలతో సీసీ రోడ్డు రద్దు చేసి తారురోడ్డు వేసేందుకు నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు విలువ రూ. 152 కోట్లకు కుదించారు. 2019 మే 31 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా గుత్తేదారు 2020 నవంబర్ నెలాఖారు వరకు గడువు కోరారు. పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో ఇప్పటి వరకు 30 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. పూర్తయిన రహదారులు సైతం గుంతలుగా మారి కంకర తేలిపోతుంది. విస్తరణ పనులు జరుగుతున్న చోట ఎలాంటి సూచికలు, రేడియం స్టికర్లు ఏర్పాటు చేయకపోవటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు వెట్ మిక్సర్​పై క్యూరింగ్ చేయకపోవటంతో దుమ్ము, దూళితో ద్విచక్ర వాహన చోదకులు నరకం అనుభవిస్తున్నారు. రహదారి వెంట ఉన్న పొలాల్లో పంటలపై దుమ్ముపట్టి పంట నష్టం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే రహదారి రొచ్చుగా మారి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. 3 నెలల వ్యవధిలో పదికి పైగా ప్రమాదాలు జరిగాయి. సబ్‌ బేస్‌లో గ్రావెల్ బదులు పెద్ద బండరాళ్లు పరిచారు. కంకరలోను డస్ట్ ఎక్కువగా ఉండటం, తెల్ల మట్టి ఉపయోగించారు. దీంతో రోడ్డు పూర్తయినా ఉపయోగం లేకుండా పోతోంది.

ABOUT THE AUTHOR

...view details