కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 350వ ఆరాధనోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 27 వరకు ఏడు రోజుల పాటు ఘనంగా జరిగే వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో నిర్వహించే..ధ్వజారోహణంతో ఆరాధనోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నెల 22న ప్రత్యేక పూజలు, 23న పూర్వారాధన, 24న మధ్యారాధన, 25న మహారథోత్సవం, 27న సర్వసమర్పణోత్సవం నిర్వహించనున్నారు.
ఉదయం ప్రవచన కార్యక్రమం, సాయంత్రం వేళ యోగీంద్ర వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, గ్రామ పురవీధులను రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం మఠం అధికారుల ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనాల కోసం అదనపు వరుసలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.