కొవిడ్ కష్టకాలంలో సేవలందించిన తమను విధుల నుంచి తొలగించడం అన్యాయమంటూ కరోనా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు చేపట్టిన నిరసన కార్యక్రమం 10వ రోజుకు చేరింది. దీంతో జిల్లాలోని వేరువేరు ప్రాంతాల్లో.. కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ఆందోళనలు కొనసాగించారు.
గుంటూరులో జిల్లాలో..
తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నినాదాలతో హోరెత్తించారు. అలాగే గుంటూరు శంకర్ విలాస్ కూడలి నుంచి లాడ్జ్ సెంటర్లోని లేబర్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ ప్రాణాలకు తెగించి.. రోగులకు సేవలు అందించామని గుర్తు చేశారు. పీపీఈ కిట్లు ధరించి గంటల తరబడి సేవలందించామని చెప్పారు. ప్రాణాలకు తెగించి పోరాడితే.. ఫలితం ఇదేనా అని ప్రశ్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు సిబ్బంది చేస్తున్న ఆందోళనకు ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపి.. నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో..
కరోనా సమయంలో విధులు నిర్వహించిన వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొవిడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రైవేటు ఉద్యోగాలను కాదని.. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకుని.. బకాయిలు చెల్లించాలని కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది కోరారు.
ప్రకాశం జిల్లాలో..
కొవిడ్ సమయంలో విశేష సేవలను అందించిన కాంట్రాక్ట్ వైద్య సిబ్బందిని విధుల నుంచి తొలగించడం పట్ల కొవిడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులోని ప్రభుత్వ వైద్యశాలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా సమయంలో విశేష సేవలందించిన తమను విధుల నుంచి తొలగించడం తీవ్ర అన్యాయమని అన్నారు. ఆరు నెలల గడువు కాలం ముగియకముందే ఉద్యోగాల నుంచి తీసేస్తున్న ప్రభుత్వం వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకొని విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: