ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. ఎన్ఆర్సీ పేరుతో బీజేపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలసంఖ్యలో ముస్లిం ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం యువకులు, మహిళలు పాల్గొన్నారు.
భారతదేశం నుంచి ఏ ఒక్కరినీ పంపించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కడప కోటిరెడ్డి కూడలి వద్ద ముస్లింలు ఐకాస ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాతో ముస్లిం సోదరులు నిరసన వ్యక్తం చేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేధిక ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. సీఏఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండిదిల్లీలో అమరావతి ఐకాస నేతలు