రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై విచారణ వేగవంతమైంది. జిల్లా ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ జూనియర్ సివిల్ జడ్జి ఎం .శైలజ సమక్షంలో సీఆర్పీసీ 164 కింద అబ్దుల్ సలాం అత్త మహబూబ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమె కూతురు, కుమారుడు వలి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మహబూబ్ న్యాయస్థానంపై తనకు గౌరవం ఉందని తమకు తప్పక న్యాయం జరుగుతుందన్నారు. తన అల్లుడి కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితులైన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లను ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. గతంలో తన అల్లుడు పనిచేసిన బంగారం దుకాణం యజమాని, అతడి కుమారుడిపై కేసు కూడా నమోదు చేసి విచారణ చేయాలన్నారు. ఆ దొంగతనాలకు సంబంధించి నిజానిజాలు వెలికి తీయాలన్నారు.