భారీ అగ్నిప్రమాదానికి గురైన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం పునరుద్దరణకు జెన్కో యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టింది. ప్రమాదం జరిగిన రెండున్నర నెలలలోపే శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఆగస్టు 20న రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడుగురు విద్యుత్ ఉద్యోగులు, ఇద్దరు ప్రైవేట్ కంపెనీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా రాత్రి 10:30 గంటల సమయంలో విద్యుత్ ప్యానల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాదాన్ని పసిగట్టిన ఉద్యోగులు రాత్రి 12 గంటల వరకు ప్రాణాలను లెక్కచేయకుండా మంటలను అదుపు చేయడానికి పోరాడారు. ప్రమాదం జరిగిన సమయంలో 17 మంది సిబ్బంది ఉండగా.. ఎనిమిది మంది త్రుటిలో తప్పించుకున్నారు. ప్రమాదంలో విద్యుత్ ఉత్పత్తి చేసే జనరేటర్లు, టర్బైన్లు, ప్యానల్ బోర్డులు, కేబుల్ వైర్లు కాలిపోయాయి. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో నష్టం రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనావేస్తున్నామని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రస్తుతం పున:ప్రారంభించిన 1,2 యూనిట్లను కోటి రూపాయల్లోపే ఖర్చు చేశామన్నారు.
80వ దశకంలో అత్యంత సాంకేతికత కలిగిన ప్రాజెక్టుగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ఆవిర్భవించింది. పంపింగ్ మోడ్, విద్యుత్ ఉత్పత్తి రెండు కలిగిన మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఇదేనని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లోనే జపాన్ సాంకేతిక కల్గిన టర్బైన్లను వినియోగించిన విద్యుత్ కేంద్రంగా ఈ ప్రాజెక్టు పేరు గాంచింది. జపాన్ బ్యాంక్ ఇంటర్నేషనల్ కో- ఆపరేషన్ ( జేబీఐసీ) ఆర్థిక సాయంతో ప్రాజెక్టు నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అప్పట్లో ఆర్థిక సాయం చేయాలంటే.. ఆ దేశ మిషన్లనే కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేది. దాని ప్రకారమే జపాన్ సాంకేతికతను కల్గిన యంత్రాలను కొనుగోలు చేశారు. ప్రాన్సిస్ టర్బైన్ (హిటాచి సంస్థ) లను జపాన్ నుంచి దిగుమతి చేసుకుని విద్యుత్ కేంద్రంలో అమర్చారు. ఆ విధంగా 2003 నుంచి 2005 కాలంలో మొత్తం ఆరు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో యూనిట్ ను 150 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో మొత్తం ఆరు యూనిట్లలో కలిపి 900ల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు గాంచిన జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించడం.. విచారకరమని జెన్కో శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ... ప్రమాదం జరిగిన ప్రాజెక్టులో తమ ఇంజినీర్ల సమష్టి కృషితోనే సాధ్యమైందని జెన్కో సీఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు.