కర్నూలు జిల్లాలోని బనగానపల్లె, బేతంచర్ల, రామాపురం ప్రాంతాల్లో వందలసంఖ్యలో నాపరాయి పరిశ్రమలున్నాయి. బేతంచర్లలోనే 400 పైగా పరిశ్రమలున్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 5 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మరో 10వేల మంది వరకూ.. పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం, సోమవారం పవర్ హాలిడే కారణంగా కరెంట్ ఉండటం లేదు. నిర్వహణ పేరుతో శనివారం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇలా వారంలో మూడు రోజులు పరిశ్రమలు మూసివేయాల్సి రావడం.. వ్యాపారాలకు శరాఘాతంలా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిశ్రమలు మూసివేయడం తప్పదంటూ పరిశ్రమ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాపరాయి పరిశ్రమ లాభసాటిగా ఉండటంతో ఎంతోమంది ఔత్సాహికులు లీజుకు తీసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం పవర్ హాలిడే కారణంగా కొంత కాలంగా వారూ తీవ్రంగా నష్టపోతున్నారు. అద్దెలు కూడా చెల్లించలేని స్థితికి పడిపోయారు. కూలీలను పోషించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.