POLLUATION: కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామ సమీపంలోని ఓ రసాయన పరిశ్రమతో సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రమైతే చాలు విషవాయువులు ఆ పల్లెలను కమ్మేస్తున్నాయి. ఘాటైన వాసనలు పీల్చి అనారోగ్యం బారిన పడుతున్నారు. కాలుష్యం కోరలు చాస్తుండటంతో పీల్చే గాలి, తాగే నీరు విషతుల్యమవుతోంది.
గ్రామాలపై విషవాయువుల ప్రభావం..
డోన్ పరిధిలోని ఉడుములపాడు, అబ్బిరెడ్డిపల్లి గ్రామాలపై విషవాయువులు తీవ్ర ప్రభావం చూపుతోంది. జగదుర్తి, కర్లకుంట, అమకతాడు గ్రామాల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే నీటిని వర్షాకాలంలో వాగులోకి వదులుతున్నారు. మిగిలిన సమయంలో బోరు వేసి అందులోకి పంపిస్తున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా జగదుర్తి చెరువులోకి వాగు నీరు చేరడంతో నీరంతా కలుషితమై పశువులు తాగేందుకు కూడా పనికిరాకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు.