2014 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ స్థానంలో వైకాపా నుంచి బరిలో దిగారు బుట్టా రేణుక. అనుహ్యంగా గెలిచిన ఆమె.. పార్లమెంట్లో అడుగు పెట్టారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా.. ఫ్యాన్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో బుట్టా రేణుక భర్త నీలకంఠం.. సైకిల్ ఎక్కారు. 2017లోనూ ఆమె కూడా చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టారు.
మారిన సమీకరణాలు.. తప్పని భంగపాటు
తెదేపాలో చేరిన బుట్టా రేణుకకు.. 2019 ఎన్నికల వరకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. కానీ ఎన్నికల ముందు నాటికి కర్నూలు జిల్లాలో సమీకరణాలు మారిపోయాయి. జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న కోట్ల సూర్యపక్రాష్ రెడ్డి.. హస్తం పార్టీని వీడి, తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కోట్లకు.. ఖరారు చేసింది తెదేపా అధినాయకత్వం. తనకు టిక్కెట్ రాకపోవటంతో.. భంగపడ్డ రేణుక తిరిగి సొంతగూటికి వెళ్లారు. ఈ ఎన్నికల్లో వైకాపా నుంచి టిక్కెట్ కోసం ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
జగన్ ఆదేశాల మేరకు.. వైకాపా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. కర్నూలు జిల్లాలో వైకాపా రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని.. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బుట్టా రేణుకకు మంచి పదవి వస్తుందని అందరూ భావించారు. రాజ్యసభ, మండలి లాంటి పదవులు ఆశించినా.. ఆమెకు ఇప్పటివరకూ ఏదీ రాలేదు. ఈ మధ్యనే జగన్ మోహన్ రెడ్డి పలువురికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. తనకు కూడా మంచి పదవి వస్తుందని ఆశించిన రేణుకకు.. మరోసారి తీవ్ర నిరాశ తప్పలేదు.