కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు గ్రామంలో దళితులు, నాయి బ్రాహ్మణుల మధ్య వివాదం పరిష్కారమైంది. వివక్ష చూపకుండా అందరికి సమానంగా క్షవరం చేయాలని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ కోరారు. గత కొన్ని ఏళ్లుగా నాయి బ్రాహ్మణులు.. గ్రామంలోని దళితులకు క్షవరం చేయడం లేదు. ఈ కారణంగా.. క్షవరం, గెడ్డం కోసం దళితులు ఆదోని వెళ్లాల్సి వచ్చేది.
కుల వివక్ష చూపుతున్నారని దళిత సంఘాల నేతలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పగల్లుకు వెళ్లిన పోలీసులు.. ఇరు వర్గాలతో మాట్లాడారు. అందరూ కలిసి మెలిసి జీవించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ వినోద్ కుమార్, తాలూకా సీఐ పార్థసారధి పాల్గొన్నారు.