మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు - police case on bhuma jagdwikayta reddy
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగద్విఖ్యాత రెడ్డిపై ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసుల అనుమతి లేకుండా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో నుంచి బలవంతంగా విడిపించుకొని వెళ్లటంతో కేసు నమోదైంది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలోని పడకండ్ల గ్రామంలో తెదేపా మాజీ కౌన్సిలర్ నరసింహుడుపై ఓ ఘటనలో కేసు నమోదైంది. కేసుకు సంబంధించి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి తన అనుచరులతో పోలీసు స్టేషన్కు చేరుకొని నిందితుడుని బలవంతంగా విడిపించుకొని తీసుకెళ్లాడు. ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు... పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సీఐ సుబ్రహ్మణ్యాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులు కేసులు నమోదు చేశారు.