నిందితులను తప్పించే యత్నం..పోలీసులపై చర్యలు - vr
పేకాట కేసులో నిందితుల్ని తప్పించే ప్రయత్నం చేశారు పోలీసులు. నలుగురికి బదులుగా వేరే వారిని కోర్టులో హాజరుపర్చారు. విషయం బయటకు పొక్కటంతో ఆ పోలీసులను వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పేకాట కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేసిన పోలీసులపై కర్నూలు జిల్లా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. గత నెలలో కోసిగి మండలంలో పేకాట ఆడుతున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు హాజరుపర్చే సమయంలో అందులో నలుగురి స్థానంలో వేరే వారిని తీసుకెళ్లారు. కేవలం జరిమానా మాత్రమే పడుతుందని చెప్పి కోర్టుకు తీసుకెళ్లగా అక్కడ న్యాయస్థానం జరిమానాతో పాటు వారం రోజుల జైలు శిక్ష విధించింది. దీనితో కోర్టు ఆవరణలోనే పోలీసులతో ఆ నలుగురు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్సై, ఏఎస్సైలతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు, వేరే వారి బదులు కోర్టుకు వచ్చిన నలుగురిపైనా కేసు నమోదు చేశారు.