Kurnool: గత నెల 26వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. శ్రీశైలంలో పర్యటించారు. ఈ సందర్భంగా.. శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం పది నిమిషాలు మాత్రమే వారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. తమకు సరైన ఇళ్లు లేవని, పదిహేనేళ్ల కిందట నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరాయని.. వర్షం కురిస్తే కూలిపోతున్నాయని.. ఆ ఇళ్లల్లో జీవించటం ఇబ్బందిగా ఉందని.. మాపై దయ ఉంచి కొత్త ఇళ్లు నిర్మించాలని, తమ గూడేలకు కనీసం తాగునీరు, రోడ్లు లేవని.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలు తీసుకువెళతానని ద్రౌపది ముర్ము హామీ ఇచ్చారు. ఐటీడీఏ అధికారులపై నమ్మకం కోల్పోయిన చెంచులు.. ఈసారి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడంతో సొంతింటి కల సాకారమవుతుందనే ఆశతో ఉన్నారు.
కర్నూలు ఐటీడీఏ పరిధిలో ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కలిపి 171 చెంచు గూడేలు, 7 వేల కుటుంబాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, కొత్తపల్లి, శ్రీశైలం, పాములపాడు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, వెలుగోడు, బి. ఆత్మకూరు, మహానంది, పాణ్యం, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, పగిడ్యాల మండలాల పరిధిలో 3 వేలకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గతంలో స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ , ప్రభుత్వ భాగస్వామ్యంతో చెంచుకాలనీల్లో 1,500 వరకు ఇళ్లు నిర్మించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహకల్ప కింద ఐటీడీఏ పరిధిలో మూడు జిల్లాల్లో మూడువేల ఇళ్లు మంజూరు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లను రద్దు చేసింది.
ప్రస్తుత ప్రభుత్వం జగనన్న కాలనీలకు శ్రీకారం చుట్టినా అవి చెంచుల దరి చేరలేదు. ఈ మధ్యనే... అధికారులు... 4 వేలా 5 వందల ఇళ్లు అవసరం ఉన్నట్లు గుర్తించారు. అవి ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో తెలియని పరిస్థితి. అడవుల్లో జీవించే చెంచులకు అటవీ చట్టాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఫలితంగా చెంచు గూడేల్లో అభివృద్ధి పనులు జరగటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... తమకు నూతన భవనాలను నిర్మించాలని, మంచినీటి వసతి, రహదారులు తదితర మౌళిక వసతులు కల్పించాలని చెంచులు కోరుతున్నారు.