ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 26, 2020, 10:09 PM IST

ETV Bharat / state

గులాబీ రంగు పురుగుతో సమస్యలా.. ఇలా చేయండి!

కర్నూలు జిల్లాలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు క్రమంగా పంటలపై దాడి చేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఉద్ధృతంగా విస్తరిస్తోంది. క్రమంగా మరిన్ని ప్రాంతాలకు ఈ పురుగు సోకే ప్రమాదం ప్రమాదం ఉంది.. ఈ పరిస్థితుల్లో గులాబీ రంగు పురుగును ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయాలను చెబుతున్న కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.

pink mite in cotton crop
కర్నూలు జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ

ప్రశ్న : కర్నూలు జిల్లాలో ఏ ప్రాంతాల్లో పత్తిలో గులాబి రంగు పురుగు ఎక్కువగా ఉంది ?

జవాబు : ఆలూరులో కొన్ని చోట్ల గులాబి రంగు పురుగు కనిపించింది. హాలహర్వి మండలంలో ఆర్థిక నష్ట పరిమితి స్థాయి వరకు గమనించడం జరిగింది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంట వేసిన 45 రోజుల నుంచి లింగాకర్షక బుట్టలు పెట్టుకోమని సూచించాం. కానీ రైతులు ఈ పద్ధతి పాటించడం లేదు. లింగాకర్షక బుట్టల్లో పడే మగ రెక్కల పురుగులను చూసి ఉద్ధృతిని గుర్తించవచ్చు. ఎకరాకు పది వరకు లింగాకర్షక బుట్టలు పెట్టుకుంటే వచ్చిన పురుగును ఇవి చంపేయడం ద్వారా ఉద్ధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. లింగాకర్షక బుట్టలను ఏలా పెట్టుకోవాలనే విషయంలో రైతులకు అవగాహన తక్కువగా ఉంది. పంట కంటే ఒకటిన్నర అడుగుల ఎత్తులో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. పంట పెరిగే కొద్ది మార్చుకుంటూ ఉండాలి. కానీ అది జరగడం లేదు. లింగాకర్షక బుట్టలో వాడే లూర్స్‌ని 30-40 రోజుల్లో పని చేసేవి పెట్టుకుంటే వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. 90-100 రోజులు పని చేసే లూర్ పెట్టుకుంటే పంట కాలానికి సరిపోతుంది.

ప్రశ్న : ఈ మధ్యన కురిసిన వర్షాలు పత్తి పంటకు లాభమా, నష్టమా?
జవాబు : కొన్ని ప్రాంతాల్లో బెట్ట పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వర్షం పడగానే పూత, పిందె రాలిపోవడం గమనిస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ప్లానోఫిక్స్‌ వాడుకోవాలి. ఈ మందును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక ఎం.ఎల్‌ మందును నాలుగున్నర లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి పురుగుల, తెగులు మందులు కలపకూడదు.

ప్రశ్న : గులాబి రంగు పురుగుతో పాటు వేరే తెగుళ్లు వస్తున్నాయా ?
జవాబు : గులాబి రంగు పురుగుతో పాటు వర్షాలకు ముందు పచ్చ దోమ ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటే ఉండింది. ఈ వర్షాలకు తీవ్రత తగ్గింది. ఇప్పుడు తామర పురుగు, పిండి నల్లి, తెల్ల దోమ కనిపిస్తోంది. గులాబి రంగు పురుగు నివారణ మందు ముందస్తుగా వాడితే తెల్ల దోమ పెరిగే అవకాశముంది.

ప్రశ్న : గులాబి రంగు పురుగులు వస్తే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
జవాబు : ఈ దశలో గుడ్లను నాశనం చేసుకోవాలంటే వేప నూనెను పిచికారి చేసుకోవాలి. గుడ్డు నుంచి పిల్ల రాకుండా చేసేటువంటి థైయోటిక్ ఆర్పాట్ మందు, ప్రొఫినోఫాస్ మందులను పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. థైయోటిక్ ఆర్పాట్ మందును ఎకరానికి 300 గ్రాములు అంటే ఒక లీటర్ నీటికి ఒకటిన్నర గ్రాము చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. ప్రొపినోఫాస్ రెండు మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లైతే తొలి దశలో గులాబి రంగు పురుగును నివారించుకోవచ్చు. ఆ తరువాత మళ్లీ గులాబి రంగు పురుగు కనిపించినట్లైతే క్లోరిఫైరిఫాస్ ముందును ఒక ఎకరానికి ఒక లీటరు నీటికి 2.5 మిల్లి లీటర్లు కలిపి పిచికారి చేసుకుంటే నివారించుకోవచ్చు. ఫినాల్ ఫాస్ ఐతే ఎకరానికి 400 మిల్లి లీటర్లు అంటే ఒక లీటరు నీటికి రెండు మిల్లి లీటర్లు మందును పిచికారి చేసుకోవచ్చు. చివరి దశలో మాత్రమే ల్యాండా సహెల్ థీన్, సైపర్ మెత్రిన్ మందులను ఒక లీటరు నీటికి ఒక మిల్లి లీటరుకు కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రశ్న : గులాబి రంగు పురుగు ఎలా గుర్తించాలి ?
జవాబు : పొలంలో పూత రాలిపోవడం లేక గూడ రాలిపోవడం, పిందె రాలిపోవడం, పువ్వులు విచ్చుకోకుండా ఉండటం. కాయలపై ఎర్రటి మచ్చలు వస్తాయి. 50 కాయులు కాని 50 పూతలు కాని తీసి చూస్తే రెండు పురుగులు కనిపిస్తే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి మించింది కాబట్టి మందులు కొట్టుకోవాలి. పొలంలో బాగా తిరిగినప్పుడు కాని, లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నప్పుడు కాని వీటి ఉనికిని గుర్తించవచ్చు.

ప్రశ్న: పక్క పొలంలో ఉన్నప్పుడు మన పొలంలో రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకేనేదానికి అవకాశముంటుందా ?
జవాబు : సామూహికంగా చర్యలు చేపట్టాలి. ఎక్కువగా లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి.

ప్రశ్న : రైతులకు ఏం చెబుతారు ?
జవాబు : సెప్టెంబర్ చివరకు వచ్చాం. ఈ నెల నుంచి పురుగు ఉద్ధృతి అక్కడక్కడా కనిపిస్తుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో మరింత పెరిగే అవకాశముంది. రైతులందరు ముందస్తు జాగ్రత్తగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. మూడు దశల వరకు పురుగు తెల్లగా ఉండి తరువాత గులాబి రంగులోకి మారుతుంది. పురుగును గమనించి ఆ కాయలను తగలబెట్టడం చేయాలి. సిఫార్సు చేసిన మందులను వాడాలి.

ఇదీ చదవండి:ప్రభుత్వ పాఠశాల భవనానికి భూమి పూజ

ABOUT THE AUTHOR

...view details