బావిలో పడిపోయిన కోళ్లను బయటకు తీసే యత్నంలో ఓ వ్యక్తి జారి పడటంతో ఇనుప చువ్వలు గుచ్చుకున్న సంఘటన ఇది. భుజం, వెన్నెముక, మూత్రపిండాల భాగంలో అవి దిగడంతో నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. చివరకు పోలీసులు క్రేన్లు, వెల్డర్ సాయంతో తీవ్రంగా శ్రమించి బాధితుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్‌నాయక్ తండాలో జరిగింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్‌నాయక్ తండా శివారులోని వ్యవసాయ క్షేత్రంలో పని చేసే గోవింద్‌నాయక్ వద్దకు కోహీర్ మండలం సిద్ధాపూర్ తండాకు చెందిన ఆయన అల్లుడు రాము రాథోడ్ శనివారం భార్యా పిల్లలతో కలిసి వచ్చాడని జహీరాబాద్ గ్రామీణ ఎస్సై పరమేశ్వర్, కుటుంబసభ్యులు తెలిపారు. వ్యవసాయ బావిలో కోళ్లు పడిపోవడంతో రాము రాథోడ్(42) తాడు కట్టుకుని దిగి మొదట వాటిని బుట్టలో వేసి పైకి పంపాడని చెప్పారు. తర్వాత అదే తాడు సాయంతో ఆయన పైకి చేరుకుంటుండగా.. జారి కిందకు పడిపోతూ బావి సిమెంటు రింగులకు ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకుని మధ్యలోనే ఇరుక్కుపోయాడని వివరించారు.