తమను తీసుకొచ్చి 14 రోజులు దాటుతున్నా ఇళ్లకు పంపించడం లేదని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారు అసహనం వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి అక్కడకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారూ, క్వారంటైన్‌లో ఉన్న మిగతావారూ ఒకే మరుగుదొడ్లను ఉపయోగించారని వైద్యులు తెలిపారు. ఈ కారణంగా మరో 14 రోజుల పాటు వారంతా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడారు. ఆళ్లగడ్డ క్వారంటైన్‌లో ఉన్న వారిని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించి టెస్టింగ్ కిట్లు రాగానే పరీక్షలు నిర్వహిస్తామని డీఎంహెచ్‌వో హామీ ఇచ్చారు. పరీక్షల్లో నెగెటివ్ వస్తే ఇంటికి పంపిస్తామని తెలిపారు.
మమ్మల్ని పంపించేయండి
కర్నూలు జిల్లా మహానంది మండలం మహానందిఫారంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలలోని రిలీఫ్ సెంటర్‌లో ఉంచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాధితులతోపాటు మరికొందరు తమను ఇంటికి పంపించాలని అధికారులపై ఒత్తిడిని తీసుకువస్తున్నారు. ఇంటికి పంపకపోతే తమ కుటుంబాలకు వారైనా డబ్బు పంపించి ఆదుకోవాలని విన్నవించారు.