కర్నూలు జిల్లా హాలహర్వి మండల పరిధిలోని గూళ్యం గ్రామం మీదుగా వేదవతి నది ప్రవహిస్తోంది. నది దాటితే కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి తదితర ప్రాంతాలకు వెళ్లొచ్చు. రహదారి మీదుగా బళ్లారికి వెళ్లాలంటే 50 కి.మీలు ప్రయాణించాలి. నదిలో కిలోమీటరు ప్రయాణించి అవతలి గట్టుకు చేరితే బళ్లారి వెళ్లేందుకు దాదాపు 25 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. వ్యయ ప్రయాసలూ తగ్గుతాయి. దీంతో గూళ్యం, సిద్ధాపురం, జె.హొస్సళ్లి, అమృతాపురం గ్రామాల ప్రజలు ఇలా పుట్టిని ఆశ్రయించి ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు.
ప్రతి గురువారం గూళ్యంలోని గాదిలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక నుంచీ భక్తులు అధిక సంఖ్యలో పుట్టిలో ప్రయాణించి వస్తుంటారు. రెండు రాష్ట్రాల నాయకులూ ఈ సమస్యపై దృష్టి పెట్టి నదిపై త్వరగా వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.