ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి లేక పల్లెల వలసలు.. ఎన్నికల వేళ నేతలకు ఇబ్బందులు - కర్నూలు నుంచి వలస వెళ్తున్న స్థానికులు

కర్నూలులో గతంలో లాగా కరువు లేదు.. అయినా వలసలు ఆగటం లేదు. ఉపాధి హామి కూలీ గిట్టుబాటు కాకపోవటం, ఖరీఫ్ సాగు పనులు ముగియటంతో స్థానికులు వలస వెళతున్నారు. ఎన్నికలు అయ్యేంతవరకు ఆగాలని నేతలు కోరుతున్నా.. వారు వినిపించుకోవటం లేదు.

people from kurnool are migrating to other districts during elections period as they have no proper employment
ఉపాధి లేక పల్లెల వలసలు.. ఎన్నికల వేళ నేతలకు ఇబ్బందులు

By

Published : Feb 6, 2021, 7:20 AM IST

కర్నూలు జిల్లాలో గతంలో మాదిరిగా ఈసారి కరవు తాండవించలేదు. అయినా వలసలు ఆగడం లేదు. ఇప్పటికే ఖరీఫ్‌ సాగు పనులు ముగియడం, రబీపై ఆశలు లేకపోవడం, ఉపాధి హామీ కూలీ గిట్టుబాటు కాకపోవడం.. వంటి కారణాలతో వేలాది కుటుంబాలు పొరుగు జిల్లాలకు, రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయి. గుంటూరు, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు నిత్యం వందల మంది సుగ్గిబాట పడుతున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కౌతాళం, కోసిగి, మంత్రాలయం మండలాల పరిధిలో 21 గ్రామాలు ఇప్పటికే దాదాపు ఖాళీ అయ్యాయి. సుమారు 5 వేల మంది వలస వెళ్లినట్లు అంచనా. ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్‌, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ వలసల ప్రభావం తీవ్రంగానే ఉంది. స్థానికంగా సాగు పనులకు వెళ్తే రూ.200 కూలీ వస్తుంది. గుంటూరు జిల్లాలో మిరపకోత పనులకు వెళ్తే పిల్లలకు రూ.250, పెద్దలకు రూ.500 వరకు చెల్లిస్తున్నారు. పిల్లలను సైతం వెంట తీసుకెళ్తున్నందున ఇక్కడి సర్కారీ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పడిపోయింది.

కర్నూలు జిల్లా మదిరె నుంచి వలస వెళ్తున్న గ్రామస్థులు
ఎన్నికలపై ప్రభావంపంచాయతీ ఎన్నికలు పశ్చిమ ప్రాంతంలో నాలుగో దశలో జరగనున్నాయి. ఎన్నికలయ్యే వరకు ఆగాలని స్థానిక నేతలు కోరుతున్నా వలస కూలీలు ఆగడం లేదు. ‘ఎన్నికలకు చానా రోజులుంది. అప్పటికి చూద్దాంలే’అంటూ ఆశావహులకు, వారి బంధువులకు సర్దిచెప్పి వలస బండెక్కుతున్నారు. స్థానిక నేతలు సుగ్గికి వెళ్తున్న వారి ఫోన్‌ నంబర్లు తీసుకుంటున్నారు. పోలింగ్‌ నాటికి రావాలని రానూ పోనూ రవాణా ఛార్జీలు, ఇతరత్రా ఖర్చులు భరిస్తామంటూ హామీ ఇస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details