కర్నూలు ఓల్డ్ సిటీ-జోహరాపురం ప్రాంతాల మధ్య నిత్యం వందల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఓల్డ్ సిటీ నుంచి జోహరాపురం, నంద్యాల చెక్ పోస్టు, నందికొట్కూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు ఈ మార్గం నుంచే రాకపోకలు సాగించేవారు. గతంలో హంద్రీనదిపై వంతెన ఉండేది. అది చాలా పాతది కావటం, తరచుగా వరదలు వస్తుండటంతో.. బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. వర్షాకాలంలో రాకపోకలు సాగించటం కష్టతరంగా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో.. ప్రస్తుత వంతెనపై కొత్త వంతెన నిర్మాణానికి అడుగులుపడ్డాయి.
హంద్రీ నదిలో వరద ప్రవాహం..
2018లో రూ.7.2 కోట్ల అంచనా వ్యయంతో.. వంతెన పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా అందుబాటులోకి రావాల్సి ఉన్నా.. ఇంతవరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం హంద్రీనదిలో వరద ప్రవాహం ఉండటంతో.. ప్రజలు రాకపోకలు సాగించటం ఇబ్బందికరంగా ఉంది.
అటు ఇటు నిచ్చెనతోనే..
వంతెన పూర్తి కాకపోవటంతో స్థానికులు అటువైపు ఒకటి, ఇటు వైపు ఒకటి నిచ్చెనలు ఏర్పాటు చేసుకున్నారు. నీటి ప్రవాహం ఉండటంతో.. నిచ్చెన వరకు తాడును కట్టారు. ఆ తాడు సాయంతో.. నీటిలో నిచ్చెన వరకు వెళ్లి.. జాగ్రత్తగా ఎక్కి.. అటువైపు చేరుకుని.. మళ్లీ నిచ్చెన దిగాల్సి వస్తోంది.