Pay and play policy in AP Sports Authority: రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ-శాప్ పరిధిలో కర్నూలు జిల్లాలో గ్రామీణ క్రీడా వికాస కేంద్రాలు , ఇండోర్ స్టేడియాలు 6 ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన క్రీడలు 31 వరకు ఉన్నాయి. కొలువుల్లో 2 శాతం రిజర్వేషన్ కోటా ఉండటంతో ఆటలకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఏటా 10 వేల మంది జిల్లా, రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలకు హాజరవుతున్నారు. ఇందులో 100 మందికిపైగా ఏపీ తరఫున జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి చోట పే అండ్ ప్లే విధానం తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్రీడలకు రుసుం తీసుకోవాలని నిర్ణయిం
ఇప్పటి వరకు ఇండోర్ స్టేడియాల్లో అడ్మిషన్, నెలవారీ ఫీజులు తీసుకొంటున్నారు. ఈత కొలను, షటిల్, యోగా, జిమ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలకు నెలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. జీవో సంఖ్య 20 ప్రకారం ఫీజులు తీసుకొంటున్నా వాటిని మరింత పెంచాలని... జిల్లా శాప్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాల వద్ద పెద్దపెద్ద అక్షరాలతో ఫ్లెక్సీలు వేశారు. అవుట్‌డోర్ క్రీడలకూ రుసుము తీసుకోవాలని నిర్ణయించారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్ క్రీడలకు సంబంధించి ఒక్కో ఆటగాడు నెలకు 500 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అండర్-14 విభాగం క్రీడాకారులకు ఓ ధర, ఆపై వయసు విభాగాల వారికి మరో ధర నిర్ణయించారు.