కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 53 జడ్పీటీసీ స్థానాలకు గాను... 16 ఏకగ్రీవం అయ్యాయి. కొలిమిగుండ్ల మండలంలో ఏకగ్రీవమైన జడ్పీటీసీ మృతిచెందగా... ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్కు జిల్లా అధికారులు రిపోర్టు చేశారు. నంద్యాల మండలంలో పోటీలో ఉన్న జడ్పీటీసీ అభ్యర్థి మృతి చెందడంతో... అక్కడ ఎన్నికలు జరగవని అధికారులు తెలిపారు. మిగిలిన 36 స్థానాలకు 146 మంది బరిలో నిలిచారు. జిల్లాలో 807 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 312 ఏకగ్రీవం అయ్యాయి. వీరిలో 9 మంది ఎంపీటీసీలు మృతి చెందారు.
ఆదోని మున్సిపాలిటీలో 3 ఎంపీటీసీ స్థానాలు విలీనం అయ్యాయి. మృతిచెందిన ఎంపీటీసీలు సహా విలీనమైనవి కలుపుకొని 12 చోట్ల ఎన్నికలు నిర్వహించటం లేదని... కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. మిగిలిన 483 ఎంపీటీసీ స్థానాలకు 1308 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 15,41,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1763 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు... వీరపాండియన్ తెలిపారు.
తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల బందోబస్తుకు 4 వందల మంది జిల్లా పోలీసులు వెళ్లగా... మిగిలిన 3 వేల మందితో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 484 ప్రాంతాల్లో 130 అతి సమస్యాత్మక, 110 సమస్యాత్మక, 244 సాధారణ ప్రాంతాలను గుర్తించారు. 5 అంతర్రాష్ట్ర, 10 అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు.