Protest at Schools: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని.. పెద్ద పేట ప్రాథమిక పాఠశాల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 46 మంది పిల్లలు.. 3,4,5 తరగతులు పెద్దపేట పాఠశాలలో చదువుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పుడు నరసన్నపేటలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే.. వారి చదువు దెబ్బతింటుందని వాపోయారు. అంత దూరం చిన్న పిల్లలు ఎలా వెళ్లి వస్తారంటూ.. ప్రశ్నించారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ.. తిరుపతి కొర్రమీనుగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కొర్రమీనుగుంట ప్రభుత్వ పాఠశాలోని.. 6,7,8 తరగతులను.. పద్మావతీపురం పాఠశాలలో విలీనం చేయొద్దని వేడుకున్నారు. అంత దూరం పాఠశాలకు వెళ్లాలంటే.. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో.. కలెక్టర్ కు వినతిపత్రం అందజేసి, సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మట్టావానిపాలెం యు.పి స్కూల్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. 6,7,8 తరగతులను రావికమతం జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు దూర భారం అవుతుందని తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.