కర్నూలు జిల్లాలో ఏడాది పొడవునా ఉల్లిని సాగు చేస్తారు. కరోనా కారణంగా ఏప్రిల్ నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్ ను మూసివేశారు. గతంలో రైతులు పండించిన పంటను విక్రయించటం చాలా కష్టతరంగా మారింది. కొనేవారు లేక, ఒకవేళ ఎవరైనా వ్యాపారులు వచ్చినా క్వింటాలు ఉల్లి రూ.400 నుంచి 500 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. రైతుల పరిస్థితి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ దృష్టికి రావటంతో... వెంటనే మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఈనెల 8వ తేదీ నుంచి కనీస మద్దతు ధర రూ.770గా నిర్ణయించారు. జిల్లాలోని గూడూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, కోసిగి, డోన్ మార్కెట్లలో కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలోని 7 వ్యవసాయ మార్కెట్లలో సాధారణ రకం ఉల్లిని రూ.300 నుంచి 500 వరకు, నాణ్యమైన ఉల్లిని రూ.770 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు పెట్టుబడి కింద రూ.50 నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతోంది. ఈ ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కారణంగా నాలుగు నెలల తర్వాత కర్నూలు వ్యవసాయ మార్కెట్ ను ఆగస్టు12న అధికారులు తెరిచారు. మొదటి రోజు 14 వందల క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. ప్రైవేటు వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు కనిష్ఠంగా రూ.210, గరిష్ఠంగా రూ.910 పలికింది.