ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లి సాగు... రైతులకు మిగిలింది కన్నీళ్లే..! - కర్నూల్లో ఉల్లి సమస్యల వార్తలు

నారు నుంచి..పంట చేతికొచ్చి మార్కెట్​కు వెళ్లేదాకా రైతన్నకి కష్టాలే వెన్నంటే ఉంటాయి. ఆరుకాలం కష్టపడి పంటను అమ్ముకోవాలంటే...గిట్టుబాటు ధరలేక కర్షకులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కర్నూల్లో అధిక వర్షాలతో ఉల్లి పంటలు పాడవ్వగా...మిగిలిన నాణ్యమైన ఉల్లికి సరైన ధరలేక రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

పోలాల్లో నిలవకుంచిన ఉల్లి

By

Published : Nov 13, 2019, 3:28 PM IST

ఉల్లి మిగిల్చిన.. కన్నీళ్లు

సేద్యాన్ని నమ్ముకొని పనిచేసే రైతుకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అనావృష్టి, అతివృష్టితో రైతన్నలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. కర్నూలు జిల్లాలో రైతులు వేల హెక్టార్లలో ఉల్లిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది రైతులు వేల ఎకరాలలో ఉల్లి నాటగా.... పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు వెంటాడాయి. అతివృష్టితో ఉల్లి దిగుబడి భారీగా పడిపోయింది. ఎకరాకు కేవలం 30 బస్తాలకు మాత్రమే పరిమితమైంది. నాణ్యమైన ఉల్లిని మార్కెట్ కి తీసుకెళ్లితే అక్కడ తమకు సరైన ధర లభించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లి చేతికందినా...చివరికు కన్నీళ్లే!
ఎకరా ఉల్లి సాగు చేసేందుకు నారు, దుక్కులు, మందులు, ఎరువులు, కూలీలకు కలిపి మొత్తం రూ.40 వేల దాకా ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు. ఎకరాకు వంద బస్తాలు రావాల్సిన చోట కేవలం 20 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి రావడంతో నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో క్వింటా ఉల్లి ధర రూ. 2 వేల నుంచి రూ . 2500 మించి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలుకు రూ. 5000 ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎక్కువ వర్షాలతో ఉల్లి దిగుబడి తగ్గిందని... మరోవైపు ధర లేకపోవడంతో తాము అన్ని విధాలా నష్టపోతున్నామన్నారు.

మద్దతు ధర కల్పించాలి...
ఎక్కువ వర్షాలతో ఉల్లి దిగుబడి తగ్గగా...మరోవైపు ధర లేకపోవడంతో రైతులు అన్నివిధాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీచూడండి.ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు.. అమ్ముకోలేని స్థితిలో రైతన్న

ABOUT THE AUTHOR

...view details