ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచి ధర, డిమాండ్ ఉన్నా... ఉల్లి రైతులకు తీరని ఆవేదన! - కర్నూలు మార్కెట్​ యార్డ్ న్యూస్

బహిరంగ విపణిలో ఉల్లికి మంచి ధరలు పలుకుతున్నా... కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నగరాల్లో కిలో ఉల్లి 100 రూపాయలు పలుకుతున్నా వారి వద్ద కొనేవారు కరువయ్యారు. మార్కెట్​లో మంచి ధర ఉన్నందున ఈసారి అప్పులు తీరుతాయనుకున్న రైతన్నల ఆశ... నెరవేరేలా కనిపించడం లేదు.

ఉల్లి రైతులు

By

Published : Nov 8, 2019, 11:54 PM IST

మంచి ధర, డిమాండ్ ఉన్నా... ఉల్లి రైతుల్లో తీరని ఆవేదన!
కర్నూలు మార్కెట్​ యార్డ్​కు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ నుంచి రైతులు ఉల్లి దిగుబడులను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ యార్డుకు ఉల్లి దిగుబడులు పోటెత్తాయి. ప్రస్తుతం యార్డులో 80 లారీల సరకు అమ్మకానికి సిద్ధంగా ఉంది. షెడ్లలో స్థలం లేనందున యార్డులోనే ఆరుబయట దిగుబడులు నిల్వ ఉంచుకున్నారు. ప్రస్తుతం సరాసరి 3 వేల క్వింటాళ్ల వరకు ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు.

వారం రోజుల పాటు నిరీక్షణ
ఉల్లి కొరత కారణంగా ఇప్పటికే దిల్లీ, ముంబయి లాంటి నగరాల్లో ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం కర్నూలు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉల్లి సరఫరా అవుతోంది. ఇతర రాష్ట్రాల్లో మన ఉల్లికి ఇంత డిమాండ్ ఉన్నా కర్నూలు మార్కెట్​ యార్డులో వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్​కు ఉల్లి దిగుబడులు తెచ్చిన తరువాత వారం రోజులు వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్కెట్​ యార్డుకు ఉల్లి దిగుమతులు ఎక్కువగా రావడం వల్లనే కొనుగోలు ఆలస్యమవుతోందని అధికారులు చెప్పుకొస్తున్నారు. వర్షం వస్తే ఆరుబయట ఉన్న ఉల్లి తడిచిపోయే అవకాశం ఉంది. దీనివల్ల మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు ఉల్లిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details