కర్నూలు జిల్లాలో 11,16,642 బియ్యం కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 9 లక్షల కార్డుల వరకు లబ్ధిదారులకు అందజేశారు. మిగిలినవి అర్హులకు చేరలేదు. ఇవి గ్రామ, వార్డు సచివాలయాలు, అర్బన్ ఏఎస్‌వో కార్యాలయాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా కర్నూలు నగరంలో 40 వేల కార్డుల వరకు పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో 862 గ్రామ, 300 వార్డు సచివాలయాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని ఎక్కువ సచివాలయాల్లో కొత్త బియ్యం కార్డులు మూలుగుతున్నాయి. వీటితోపాటు వేల సంఖ్యలో ఆరోగ్యశ్రీ కార్డులు సైతం ఉన్నాయి. వార్డు అడ్మిన్లు తమ సచివాలయం పరిధిలోని కార్డులను వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందించేలా చూడాలి. తమ సచివాలయం పరిధి కాకపోతే ఏ సచివాలయానికి సంబంధించినవో వాటిని ఆయా ప్రాంతాలకు పంపేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఇది పూర్తిస్థాయిలో జరగడం లేదు.
సరిచూసుకునే ఆప్షన్ లేక..:
ప్రభుత్వం కొత్త బియ్యం కార్డులు మంజూరు చేసి వాటిని ముద్రించి జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలకు పంపుతోంది. ఇతర సచివాలయాల కార్డులు మరో సచివాలయాల్లోకి పొరపాటున వెళ్తున్నాయి. ఏఎస్‌వో కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దారు కార్యాలయాల్లో కొత్త బియ్యం కార్డులు ఉండిపోయాయి. జిల్లా కేంద్రంతోపాటు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏఎస్‌వో కార్యాలయంలో లేదా గ్రామ, వార్డు సచివాలయంలో కొత్త బియ్యం కార్డు నంబరుతో.. ఏ సచివాలయంలో ఉందో తెలుసుకునే వీలు లేకుండా పోయింది. అర్బన్ ఏఎస్‌వో కార్యాలయంలో కొత్త బియ్యం కార్డులకు సంబంధించి సెర్చింగ్ ఆప్షన్.. ఏ కార్డు ఎక్కడుందో తెలుసుకునేందుకు లాగిన్ లేదు. ఈ కారణంగా కొత్త బియ్యం కార్డులు ఇస్తున్నారే తప్ప అవి నిజంగా కార్డుదారులకు అందుతున్నాయా? లేదా? అని సరిచూడటం లేదు. లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేకపోయింది.
భారీ వ్యవస్థ ఉన్నప్పటికీ...