తుంగభద్ర పుష్కరాల్లో మూడో రోజు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ సాధారణ రోజుల్లాగే పలచగా కనిపించారు. కర్నూలులోని సంకల్‌భాగ్, మంత్రాలయం ఘాట్ల వద్ద తప్ప మిగిలిన చోట్ల భక్తుల సంఖ్య చాలా తక్కువుగా ఉంది. భక్తులు తక్కువగా ఉన్నా వారికి ఇబ్బందులు తప్పడం లేదు. నదిలో నీళ్లు చాలా తక్కువుగా ఉన్నాయని పిండ ప్రదానాలకు కూడా ఇబ్బంది పడుతున్నామని భక్తులు చెబుతున్నారు.
పుష్కరాల్లో స్నానాలకు అనుమతివ్వాలంటూ కొన్ని రోజులుగా భాజపా డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై భాజపాతో కలిసి విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ 'చలో తుంగభద్ర'కు పిలుపునివ్వడంతో ఘాట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. భాజపా నాయకురాలు బైరెడ్డి శబరి సంగమేశ్వరంలో స్నానం చేశారు. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.