ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త పాలసీతో ఇసుక కష్టాలు తీరేనా? - ఇసుక విధానంపై ఏపీ కేబినేట్

మంత్రి వర్గ ఉప సంఘం సూచనలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకురానుంది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ విధానంపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఇసుక విధానానికి మండలి ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానంతో ప్రజల ఇసుక కష్టాలు తీరుతాయా? లేక మళ్లీ కథ మొదటికే వస్తుందా? అనేది వేచిచూడాల్సిఉంది. రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను మూడు మండలాలుగా విభజించారు. అందులో కర్నూలు జిల్లాను మండలం-3లో చేర్చారు.

New sand policy
New sand policy

By

Published : Nov 6, 2020, 3:45 PM IST

కర్నూలు జిల్లాలో ప్రతి రోజూ 3 నుంచి 4 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక వాడకం జరుగుతోంది. తుంగభద్ర నదిలో ఇసుక లభ్యత 4 నుంచి 5 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటుందని అధికారుల అంచనా. కొత్త పాలసీలో ఇసుక తవ్వకం, నిల్వ, అమ్మకాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా జిల్లాలో తొమ్మిది ఇసుక డిపోలు ఏర్పాటు చేసి అమ్మకాలు చేపడుతున్నారు. నదుల నుంచి వచ్చే నాణ్యమైన ఇసుకనే లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వకూడదని సూచించింది. జిల్లాలో పట్టా భూమి ఇసుక తవ్వకాలకు ఒకరు దరఖాస్తు చేసుకోగా గతంలోనే తిరస్కరించారు.

ప్రస్తుతం తుంగభద్ర నదిలో సి.బెళగల్‌లో ఆరు రీచ్‌లుండగా, ఈర్లదిన్నె, ఉడుమాల, పల్లెదొడ్డి, పల్లెదొడ్డి-1 నాలుగు రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నదీ తీరంలోని నాగులదిన్నె, బి.కొత్తకోట, ఓల్డ్‌ రంగాపురం రీచ్‌లలో తవ్వకాలకు ఏపీఎండీసీతో ఒప్పందం పూర్తయింది. కొత్త విధానం అమలుపై ఉత్తర్వులొస్తే దానిని బట్టి త్వరలో ఇక్కడ రీచ్‌లను ప్రారంభించే అవకాశాలున్నాయి.

నదుల పక్కనున్న గ్రామాల ప్రజలు తమ సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఉచిత ఇసుక తెచ్చుకోవచ్చని అనుమతులిచ్చారు. ప్రస్తుత కేబినెట్‌ సమావేశంలోనూ దీన్ని కొనసాగిస్తూ వెసులబాటు కల్పించారు. ఇదే అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఎడ్ల బండ్ల ద్వారా నదిలో ఇసుకను నిర్మానుష్య ప్రదేశాల్లో డంప్‌ చేసి, ట్రాక్టర్లు, లారీల్లో బ్లాక్‌లో అమ్మకాలు చేపడుతున్నారు. ఇసుక కొరత ఎక్కువ ఉన్న సమయంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.9-11 వేల వరకు వసూళ్లు చేసి జేబులు నింపుకున్నారు.

ప్రస్తుతం డిపోల నుంచి ఇంటికి చేరేలోగా ట్రాక్టర్ ఇసుక ధర రూ.5-7 వేల వరకు దూరాన్ని బట్టి వసూళ్లు చేస్తున్నారు. ఇకపై రీచ్‌ల వద్దే అమ్మకం ధర బోర్డు పెట్టి దానికి మించి అమ్మకూడదనే నిబంధనను ప్రభుత్వం తెస్తుంది. పైగా ఆఫ్‌లైన్‌లోనూ ఇసుక అమ్మకాలు జరిపేలా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల లబ్ధిదారుడు నచ్చిన రీచ్‌ నుంచి నాణ్యమైన ఇసుకను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారుడు రీచ్‌ల నుంచి సొంత వాహనంలోనైనా ఇసుక తెచ్చుకోవచ్చు లేదా రీచ్‌ల వద్ద కాంట్రాక్టు ట్రాక్టర్లను అందుబాటులో పెట్టి లబ్ధిదారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్న నిబంధన తెచ్చారు. కొత్త విధానంపై ఉత్తర్వులు, నిబంధనలు వస్తే ఆ తరహాలోనే జిల్లాలో అమలు చేస్తామని ఇసుక డిపో మేనేజర్‌ వేణుగోపాల్‌ తెలిపారు.

ఇదీ చదవండి :దారికాస్తారు... దోచుకెళ్తారు

ABOUT THE AUTHOR

...view details