Nara lokesh : నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గుడిపాడు నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం హనుమంతురాయునిపల్లి రైతులు నారా లోకేశ్‌ను కలిశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయని... కరువు మండలాలకు పరిహారం అందడం లేదని వాపోయారు. గతంలో పంటబీమా, ఇన్ పుట్ సబ్సిడీ, కరువు చెక్కులు వచ్చేవని గుర్తు చేశారు. కరువు పరిస్థితులను అంచనా వేసి గతంలో మండలాల వారీగా అదనంగా పనిదినాలు కల్పించామని చెప్పిన లోకేశ్.. జగన్ నాలుగేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే రైతులకు బీమా సొమ్ము అందించారని అన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి పట్టడం లేదని... హనుమంతురాయునిపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చెరువు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అనంతరం గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నాయకులు నారా లోకేశ్ ను కలిసి తమ సమస్యలు వివరించారు.
అంబేడ్కర్‌ను అవమానించిన సాక్షి..అంబేద్కర్ జయంతి సందర్భంగా సాక్షి పత్రిక, ఛానెల్, వైఎస్సార్సీపీ నాయకులు, సాక్షి యజమాని భారతి రెడ్డి... దళితుల్ని అవమానపరిచారని నారా లోకేశ్ ఆరోపించారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో యువగళం పాదయాత్రలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. దళితుల గురించి తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు, భారతి రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నారని... వారు రాసిన వార్తకు సంబంధించిన అసలైన వీడియో విడుదల చేయాలని సవాలు విసిరారు. లేదంటే క్షమాపణ చెప్పాలని కోరారు.
జగన్ మోహన్ కాదు.. రిచ్ మోహన్...ప్యాపిలి మండలంలో దళితుల గురించి తాను మాట్లాడిన వీడియో ఏమిటో ఇప్పటికే విడుదల చేశానని... దళితులను చంపుతున్న వైఎస్సార్సీపీ నేతలు వారి గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని నారా లోకేశ్ ప్యాపిలి బహిరంగ సభలో దుయ్యబట్టారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న డోన్ నియోజకవర్గంలో నడవడం ఆనందంగా ఉందని లోకేశ్ అన్నారు. 30 మంది సీఎంలకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటే అందులో ఒక్క జగన్ కే 51 శాతం... అంటే 510 కోట్ల రూపాయల ఆస్తి ఉందని ఆరోపించారు. మిగిలిన 29 మంది సీఎంల ఆస్తి కలిపితే రూ.500 కోట్లేనని... అందుకే జగన్ మోహన్ పేరును రిచ్ మోహన్ గా మార్చానని అన్నారు. పేదవాడు ఎప్పడూ పేదరికంలోనే ఉండాలనేది... రిచ్ మోహన్ కోరిక అని వివరించారు.
ఏటా ఉద్యోగ నోటిఫికేషన్..టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తామని... విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించటం సహా అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఆర్థిక మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మట్టి రవాణా మొత్తం అప్పుల అప్పారావు మేనల్లుడు గజేంద్రరెడ్డికి అప్పగించారని ఆరోపించారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ.6000, టిప్పర్ రూ.25000 వరకూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అప్పుల అప్పారావు కుటుంబం కరోనా ని కూడా క్యాష్ చేసుకుందని... ఈయన అన్న బుగ్గన హరినాథ్ రెడ్డి ఎండీగా ఉన్న కంపెనీ నుంచి ప్రభుత్వం పీపీఏ కిట్లు కొనుగోలు చేసిందని తెలిపారు. బుగ్గన... ప్యాపిలి మండలం బూరుగుల గ్రామంలో సర్వే నంబర్ 870 లో దాదాపు 500 ఎకరాలు కాజేశారని ధ్వజమెత్తారు. డోన్ రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన అర్జున్ రెడ్డికి చెందిన 5 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని గజేంద్ర రెడ్డి కబ్జా చేశారని తెలిపారు. బేతంచెర్ల టౌన్ లో సర్వే నెం.123 వంక పోరంబోకు స్థలం కబ్జా చేసి బిల్డింగులు కట్టేశారని... గోర్లగుట్ట గ్రామంలో దేవుని మాన్యం భూములు 26 ఎకరాలు కొట్టేయడానికి స్కెచ్ వేశారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.