Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని పొలిమేరమెట్ట నుంచి 71వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. కలచర్లలో స్థానికులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్.రంగాపురం వద్ద ఎన్టీఆర్ హౌసింగ్ బాధితులతో సమావేశం నిర్వహించారు. తుగ్గలి మండలం శభాష్ పురం వద్ద కర్నూలు జిల్లాలో పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. సాయంత్రం రాంపల్లి సర్కిల్ వద్ద బహిరంగసభలో లోకేశ్ ప్రసంగించనున్నారు.
రిచ్ మోహన్ అంటూ జగన్ సెల్ఫీ.. పింఛను పీకేసిన 6 లక్షల మందితో సెల్ఫీ దిగి.. 'రిచ్ మోహన్ అంటూ జగన్ సెల్ఫీ' విడుదల చేశారు. దేశంలోనే రూ.510 కోట్లతో పెత్తందారీ సీఎం రిచ్ మోహన్ రెడ్డి గారూ! నిరుపేద వితంతువుకి ఇచ్చే భరోసా పింఛను తీసేసి ఏం మూటకట్టుకుంటావు? ప్రతీ ఇంటికి మేలు చేశామని, ఆ ఇంటివారితో నిజమైన సెల్ఫీ దిగుతానని గొప్పగా చెప్పావు కదా రిచ్ మోహన్ అంటూ ఎద్దేవా చేశారు. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం శభాష్‌పురం గ్రామంలో తలారి యంకమ్మ అనే వితంతువుకి రెండేళ్ల క్రితమే పింఛను తీసేశావు. బోరున విలపిస్తున్న ఆ వితంతువుతో వచ్చి సెల్ఫీ దిగి.. ఎన్టీఆర్ భరోసా పింఛనుని, వైఎస్సార్ పెన్షన్ కానుకగా పేరు మార్చావు. ఎన్నికలకు ముందు 3 వేలకు పెంచుతామన్న పింఛను నాలుగేళ్లయినా ఇంకా 3 వేలకు చేరలేదు. ఈ లోగానే తలారి యంకమ్మలాగే రాష్ట్రంలో 6 లక్షల మంది బతుకులకి భరోసా అయిన పెన్షన్ పీకేశావు అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.