Lokesh Yuva Galam Padayatra: తెలుగుదేశం అధికారంలోకి రాగానే చేనేత వ్యవస్థను ప్రక్షాళన చేసి సమస్యలన్నింటినీ పరిష్కారిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. 86వ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగించిన యువనేత..టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గోనెగండ్లలో 11 వందల కిలోమీటర్ల మైలురాయిని పాదయాత్ర చేరుకోవడంతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 86వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు విడిది కేంద్రం నుంచి యాత్ర ప్రారంభించగా.. అడుగడుగున స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. గోనెగండ్ల రోడ్డులోని ఏడు మోరీల వద్ద గొర్రె కాపరులను పలకరించిన యువనేత వారి కష్టాలను తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీల పరిధిలో ఖాళీగా ఉన్న బంజరు భూముల్లో గొర్రెల పెంపకానికి హక్కులు కల్పిస్తామన్నారు. సబ్సిడీ సహా ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపరులకు 10 లక్షల బీమా ఇస్తామన్నారు..
"కార్పొరేట్ బ్యాంకుల్లో వన్ టైమ్ సెటిల్మెంట్ చేయమని మీరు అడుగుతున్నారు కాబట్టి మొత్తం ఎంత ఉందో అన్ని వివరాలు కనుక్కొని దానిపైనా నేను స్పందిస్తాను. టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తాం. చేనేత సోదరులను నేను దత్తత తీసుకుంటాం. మొత్తం వ్యవస్థనే ప్రక్షాళన చేస్తాం. చేనేతలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యతను తెలుగుదేశం తీసుకుంటుంది"-నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి