Welcome to Nara Lokesh : యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు కర్నూలు నగరంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం ఎస్టీబీసీ కళాశాల మైదానం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు స్వాగతం పలికారు. కొండారెడ్డి బురుజు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు. అంబేడ్కర్ సర్కిల్, గడియారం ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో జనం కిక్కిరిసి పోయారు.
సర్పంచుల ఆత్మహత్య బాధాకరం.. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు కాకపోవడంతో అప్పుల పాలైన సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం సర్పంచ్ బాదం ధనలక్ష్మిది ఆత్మహత్య కాదు, వైఎస్సార్సీపీ సర్కారు చేసిన హత్య అని ధ్వజమెత్తారు. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్లను మళ్లించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. సర్పంచులు చేసిన పనులకు బిల్లులు కూడా చెల్లించకపోవడమే ఈ బలవన్మరణాలకి కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సర్పంచుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధనలక్ష్మి మృతికి జగన్ రెడ్డి సర్కారు బాధ్యత వహిస్తూ కోటి పరిహారం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.