Nara Lokesh Yuvagalam @ 100 Days: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వందో రోజు ఉత్సాహం సాగింది. నంద్యాల జిల్లా మోతుకూరులో వంద రోజుల పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరించారు. వందో రోజు తల్లి భువనేశ్వరితోపాటు నందమూరి కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు. చెంచులతో ప్రత్యేకంగా సమావేశమైన లోకేశ్.. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి పక్కా గృహాలు నిర్మించడమేగాక, ఉపాధి హామీ పథకం అమలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నో అడ్డంకులను దాటుకుని లోకేశ్ పాదయాత్ర వంద రోజుల మైలురాయిని చేరుకున్నాడు. పాదయాత్రతో లోకేశ్.. యువతను ఆకట్టుకుంటూ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. వైకాపా నేతల అవినీతిని బట్టబయలు చేస్తూ లోకేశ్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒక్క అడుగుతో మొదలైన ప్రయాణం మైళ్లకొద్దీ సాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను అత్యవసర సందర్భాలు మినహా విరామం లేకుండా కొనసాగిస్తున్నారు. వందో రోజు లోకేశ్‌తోపాటు ఆయన తల్లి నారా భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు యాత్రలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మోతుకూరులో వంద రోజుల పాదయాత్ర పైలాన్‌ను నారా లోకేశ్ ఆవిష్కరించారు.
నంద్యాల జిల్లా సంతజూటూరులో చెంచులతో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం అమలు చేయడం లేదని చెంచులు తెలపగా.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని లోకేశ్ పేర్కొన్నాడు. చెంచులకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. చెంచులకు భూములు పంచడమేగాక... ప్రత్యేక పంటలు పండించేలా ప్రోత్సహించి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ తెలిపారు. అడవిలోకి స్వేచ్ఛగా వెళ్లే హక్కు కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. చెంచుగూడెంలో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.