దిశ చట్టం, ఈ-రక్షాబంధన్ అనేవి సీఎం జగన్ ప్రచారం చేసుకోవడానికే తప్ప.. క్షేత్రస్థాయిలో వాటివలన మహిళలకు ఒరిగిందేమీ లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం ఏడాదికి పైగా పాలనలో రాష్ట్రంలో 400 అత్యాచార ఘటనలు జరిగితే.. 21 రోజుల్లో ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు.
కర్నూలు జిల్లాలో భర్త ముందే ఒక ఎస్టీ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. వారిపై కేసు నమోదు చేయడానికి గిరిజన సంఘాలు ఉద్యమం చేయాల్సిరావడం.. జగన్ పాలనలో బాధిత మహిళలకు అన్యాయం ఎంత జరుగుతుందో అనడానికి నిదర్శనమన్నారు. ఆ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.