నంద్యాల పట్టణంలో గతనెల 25న అపహరణకు గురైన అన్నాచెల్లెళ్ల ఉదంతం విషాదాన్ని మిగిల్చింది. సహజీవనంలో ఉన్న తల్లి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదన్న కారణంతో ఓ వ్యక్తి వారిని తీసుకెళ్లాడు. అనంతరం చెల్లెలిని బెంగళూరులో అమ్మి, అన్న(13)ను గొంతు నులిమి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.
అమ్మాయిని తల్లికి అప్పగించిన పోలీసులు, కోవెలకుంట్ల మండలం రేవనూరు కేసీ కాల్వ వద్ద బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్తకు మూడేళ్లుగా దూరంగా ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు.
తమ తల్లి తమను సరిగ్గా చూసుకోవటం లేదని.. పిల్లలు ఇబ్బంది పడుతూ, వారి కుటుంబానికి తెలిసిన చాకలి నాగకృష్ణ అలియాస్ కిట్టుకు బాధను చెప్పుకొన్నారు. నాగకృష్ణ, అతని స్నేహితుడైన కుంజు ధనుంజయుడు కలిసి చిన్నారులను బెంగళూరుకు తీసుకెెళ్లి అక్కడ తమకు తెలిసిన వాళ్లకు వారిని అనాథలుగా చూపి, విక్రయించే ప్రయత్నం చేశారు. వారు అమ్మాయిని మాత్రమే పెంచుకుంటామని చెప్పడంతో చిన్నారిని వారికి అప్పగించారు.