Nadu Nedu works Not Completed: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. కానీ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు- నేడు పనుల్లో నెలకొన్న జాప్యం విద్యార్థులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం బడులు తిరిగి ప్రారంభమయ్యే నాటికి.. రెండో దశ నాడు-నేడు పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ చాలా పాఠశాలల్లో పనులు నత్తతో పోటీ పడుతున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆరుబయట వరండాల్లో విద్యను అభ్యసించాల్సిన దుస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 651 పాఠశాలలకు మరమ్మతు పనులు చేపట్టారు. వీటిలో 118 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. 676 పాఠశాలల్లో విద్యుదీకరణ పనులు చేపట్టగా.. 76 బడుల్లో మాత్రమే పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. 237 పాఠశాలల్లో మరుగుదొడ్లు, 174 పాఠశాలల్లో కిచెన్ షెడ్ల పనులు, 289 బడుల్లో తాగునీటి కల్పన పనులు నిర్మాణంలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిధుల కొరత వల్లే నాడు-నేడు పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నా.. అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తి చేసి.. విద్యార్థుల చదువుకు ఆటంకాలు తలెత్తకుండా చూడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.