ముఖ్యమంత్రి జగన్ నేడు కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అధికారంలోకి వస్తే ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తానంటూ హామీ ఇచ్చిన జగన్.. ఆసుపత్రుల్లోనూ నాడు- నేడు కార్యక్రమం అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ఆధునీకరించే పనులను ఇవాళ కర్నూలులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వివిధ చోట్ల ఆసుపత్రులను బలోపేతం చేయటం, అవసరమైన చోట్ల మరమ్మతులు, కొత్త ఆసుపత్రుల నిర్మాణం సహా అన్ని సదుపాయాలూ కల్పించనున్నారు. రూ.11,737 కోట్ల వ్యయంతో మూడేళ్లలో దశల వారీగా కార్యక్రమం చేపట్టనున్నారు.
తొలిదశలో రూ.1,129 కోట్ల వ్యయంతో 7,548 ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 1,086 ఉపకేంద్రాలు ప్రభుత్వ భవనాలలో ఉండగా మరో 1,084 కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో కలిసి ఉన్నాయి. రూ. 23 లక్షల వ్యయంతో కొత్తగా 4,906 ఉపకేంద్రాలు నిర్మించనున్నారు. 888 చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగిల్ బెడ్ రూమ్, వంటగది, మరుగుదొడ్లతో కూడిన స్టాఫ్ క్వాటర్స్, ల్యాబ్, పరీక్షా గది, క్లినిక్, పూర్తిగా అమర్చిన వైద్య సామగ్రి, అవసరమైన ఫర్నీచర్ ఉపకేంద్రాల్లో ఉంటాయి. నాడు- నేడు రెండో దశలో 1,907 కోట్ల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రులను బలోపేతం చేస్తారు. అవసరమైన చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడో దశలో రూ.8,701కోట్లతో అన్ని జిల్లా ఆస్పత్రులను బలోపేతం చేయటంతోపాటు, బోధనా ఆస్పత్రులు, కొత్తగా ప్రత్యేక ఆస్పత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తారు.
కడపలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి