రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం పుర పోరుకు పచ్చజెండా ఊపింది. ఉదయం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గత ఏడాది మార్చి 23న నిర్వహించాల్సిన పురపాలక ఎన్నికలు కరోనాతో అదే నెల 15న వాయిదా పడ్డాయి. అప్పటివరకు కొందరు నామినేషన్లు అందజేశారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఎక్కడ ఆగిందో నామినేషన్ల పర్వం అక్కడి నుంచి అమలు చేసేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 2, 3 తేదీల్లో నామపత్రాల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అదేరోజు బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు. మార్చి 10న జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థతో పాటు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ పురపాలక సంఘాలు, నగర పంచాయతీ అయిన గూడూరుకు ఎన్నికలు జరగనున్నాయి. 14న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
పురపాలిక ఎన్నికలకు లైజనింగ్, పర్యవేక్షక అధికారులను నియమిస్తూ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కార్పొరేషన్‌కు లైజనింగ్ అధికారిగా జి.గోపి, పర్యవేక్షణాధికారి యు.వెంకటరామయ్య నియమితులయ్యారు. మిగిలిన ఏడు మున్సిపాల్టీలు, ఒక నగర పంచాయతీకి లైజనింగ్ అధికారిగా సీహెచ్ రాజేష్, పర్యవేక్షణాధికారిగా సాయికిరణ్‌ను నియమించారు.
కచ్చితంగా ఏడాది తర్వాత.. పుర పోరు కరోనాతో నిలిచి ఏడాది అవుతోంది. కర్నూలు కార్పొరేషన్‌కు 11 ఏళ్ల తర్వాత ఎన్నికల పండగొచ్చింది. పాలకవర్గం లేక కొన్నేళ్లుగా నగరంలో సమస్యలు తిష్ట వేశాయి. నగరంలో 52 వార్డులున్నాయి. వీటిలో కల్లూరు పరిధిలో 16, కోడుమూరు పరిధిలో 3, కర్నూలు పరిధిలో 33 వార్డులున్నాయి. నగరపాలక సంస్థ అయ్యాక తొలి మేయర్‌గా బంగి అనంతయ్య నిలిచి, జాతీయ స్థాయిలో సత్కారాలు అందుకున్నారు.
నామపత్రాలు ఇచ్చారిలా..: