పురపాలక ఎన్నికల్లో మొదటి అంకం ముగిసింది. తొలిరోజు అంతంత మాత్రంగా ఉన్నా శుక్రవారం చివరిరోజు కావడంతో నామినేషన్ల దాఖలుకు ఆశావహులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల వద్ద నాయకులు, అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులతో కోలాహలం నెలకొంది. జిల్లాలోని 302 వార్డుల్లో 2,061 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో వరుసలో నిల్చుని నామపత్రాలు సమర్చించారు. అత్యధికంగా కర్నూలు నగరపాలికలో 614 నామినేషన్లు దాఖలు కాగా స్వతంత్ర అభ్యర్థులు 182 మంది దాఖలు చేయడం గమనార్హం.
పార్టీ గెలుపునకు మంత్రుల వ్యూహాలు
నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగియడంతో పోటీల్లో ఉన్న అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు. జిల్లాలో తొమ్మిది పురపాలికల్లో ఎన్నికలు జరుగుతుండగా అన్నింటిలోనూ అధికార పార్టీ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల బాధ్యతంతా స్థానిక ఎమ్మెల్యేలదే అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేయడంతో వారంతా అభ్యర్థుల ఎంపిక మొదలుకొని బి-ఫారం అందజేత వరకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి వార్డు సభ్యుడు మేయర్ అభ్యర్థి అన్నంతగా కష్టపడి పని చేయాలని సూచిస్తున్నారు. తమ చేతుల్లో ఏమీ లేదని అధిష్ఠానం చెప్పిన విధంగా ఎన్నికల అనంతరమే పదవులు నిర్ణయిస్తామని వెల్లడిస్తున్నారు.
టిక్కెట్ల ముచ్చట్లు తెగట్లే..
పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీల్లో టిక్కెట్ల గోల తారస్థాయికి చేరింది. ముందుగా టిక్కెట్ ఆశిస్తున్న అందరి చేత నామినేషన్లు వేయించారు. అసలైన వారితో చివరి రోజున ఎన్నికల అధికారులకు బి-ఫారాలు అందించే వ్యూహంతో వెళుతున్నారు. వైకాపా, తెదేపా, కాంగ్రెస్, భాజపా, పూర్తి స్థాయిలో అభ్యర్థిత్వాలను ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా టిక్కెట్ల బి-ఫారాలు వచ్చాయా అనే ముచ్చట్లే వినిపిస్తున్నాయి. బరిలో నిలిచేదెవరనే సందిగ్ధత ఇంకో రెండుమూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది.
నేడు పరిశీలన..:
దాఖలైన నామపత్రాలను శనివారం పరిశీలిస్తారు. అభ్యర్థుల సమక్షంలో పరిశీలించి సరిగ్గా లేని వాటిని తిరస్కరిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించిన వారు జిల్లా ఎన్నికల అధికారికి అప్పీలు చేసుకోవచ్ఛు సోమవారం నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 23న పోలింగ్, 27న లెక్కింపుతో విజేతలు ఎవరనేది తేలనుంది.
- కర్నూలు మేయర్ అభ్యర్థిగా వైకాపా తరఫున బీవై రామయ్యను ప్రకటిస్తారని భావిస్తుండగా, తెదేపా నుంచి నరసింహాయాదవ్ అభ్యర్థి అనే ప్రచారం సాగుతోంది. 52 వార్డులకు 614 నామినేషన్లు దాఖలు కాగా అత్యధికంగా వైకాపా 202, తెదేపా 105, స్వతంత్రులు 182 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థులు ఉండటం గమనార్హం
- ఆదోనిలో ఏ పార్టీ నుంచి ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. 42 వార్డులకు 243 నామినేషన్లు దాఖలయ్యాయి. ● నంద్యాలలో వైకాపా నుంచి శిల్పా నాగినితోపాటు ఛైర్‌పర్సన్ పదవికి పలువురు పోటీ పడుతున్నారు. తెదేపా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. 42 వార్డులకు 371 నామినేషన్లు దాఖలయ్యాయి. వైకాపా 119 నామినేషన్లు వేయగా, తెదేపా 107 నామినేషన్లు వేసి గట్టి పోటీ ఇస్తోంది.
- ఎమ్మిగనూరులో వైకాపా నుంచి డాక్టర్ రఘును ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించగా, తెదేపా ప్రకటించలేదు. 34 వార్డులకు 189 నామినేషన్లు దాఖలు కాగా 89 తెదేపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ వైకాపా నుంచి 68 నామినేషన్లు దాఖలయ్యాయి.
- నందికొట్కూరులో వైకాపా నుంచి జాకీర్ ప్రయత్నిస్తుండగా, తెదేపా నుంచి ఆశావహులు ముందుకు రాడం లేదు.
- డోన్‌లో వైకాపా నుంచి సత్తశైల రాజేష్‌ను ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించగా, తెదేపా ఎన్నికలను బహిష్కరించింది. ప్రస్తుతం 13 మంది వేసిన నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారని తెలిసింది. 32 వార్డుల్లో 130 నామినేషన్లు దాఖలయ్యాయి.
- ఆత్మకూరులో వైకాపా నుంచి వైద్యురాలు ఆసియా ఛైర్‌పర్సన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. 24 వార్డుల్లో 121 నామినేషన్లు దాఖలయ్యాయి.
- ఆళ్లగడ్డలో వైకాపా నుంచి ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి ఛైర్మన్ అభ్యర్థిగా నిలవాలని యత్నిస్తున్నారు. 27 వార్డులకు 96 నామినేషన్లు దాఖలు కాగా వైకాపా తరఫున 48, తెదేపా తరఫున 36 మంది నామపత్రాలు వేశారు.
- గూడూరులో పోటాపోటీ ఉంది. వైకాపా నుంచి జులుపాల నడిపి వెంకటేశ్వర్లు ఛైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తుండగా, తెదేపా నుంచి అకేపోగు చిన్న బతుకన్న ఛైర్మన్ అభ్యర్థిగా నిలిచేందుకు యత్నిస్తున్నారు. 20 వార్డుల్లో వైకాపా నుంచి 40, తెదేపా నుంచి 31 నామినేషన్లు దాఖలయ్యాయి.
- పుర ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయడానికి నేతలు ఆసక్తి ప్రదర్శించారు. అన్ని పురపాలికల్లో ఎక్కువ సంఖ్యలో నామపత్రాలు దాఖలు కావడమే ఇందుకు నిదర్శనం. ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థులే అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన పురపాలికల్లో కొన్ని వార్డులకు విపక్షాలకు అభ్యర్థులు దొరక్కపోవడం గమనార్హం. మరికొంతమంది ఔత్సాహిక నేతలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు.
భారీ సంఖ్యలో స్వతంత్రులు :
తొమ్మిది పురపాలికల్లో 2,061 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 379 స్వతంత్రులవి కావడం గమనార్హం. పార్టీల నుంచి బి-ఫారాలు వచ్చిన రాకపోయినా పోటీలో ఉండాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. నామపత్రాలు ఉపసంహరణ దిశగా బుజ్జగింపులు ఊపందుకున్నాయి. కొన్ని పురపాలికల్లో కొంతమంది అధికార పార్టీ నుంచి రెబల్స్ బరిలో ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీపై ఏమేరకు ప్రభావం చూపనుందో మున్ముందు తేలనుంది.
ఇదీ చదవండి :మాచర్ల పురపాలక పీఠం వైకాపా వశం..!