'నీరు విడుదల చేయాలి'
గోరుకల్లు జలాశయం నుంచి కుందూ నదికి నీటిని విడుదల చేయాలని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రెండు రోజుల పాటు ధర్నా చేశారు. అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి... ఎంపీతో దీక్ష విరమింపజేశారు.
కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు జలాశయం నుంచి కుందూనదికి నీరు విడుదల చేయాలని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ధర్నా చేశారు. కుందూనది పరివాహక గ్రామాలైన కోవెలకుంట్ల, దొర్నిపాడు,ఉయ్యాలవాడ మండలాలకు చెందిన గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని రెండు రోజులు పాటు నిరసనకు దిగారు. దుర్గం జలాశయం ఆనకట్టపై టెంట్ వేసుకునిరైతులతో కలిసి కూర్చున్నారు. నీరు విడుదల చేసే వరకు అక్కడినుంచి వెళ్లేది లేదని ఎంపీ ఎస్పీవై రెడ్డి పట్టుబట్టారు.
గోరుకల్లు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తే స్థానికంగా ఉన్న పంటలు నష్టపోతాయని... నీటి విడుదలను అడ్డుకుంటామని రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జలాశయం వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాలు జలాశయం వద్దకు చేరుకోవడంతో వివాదంగా మారింది. నంద్యాల డీఎస్పీ రాఘవేంద్ర ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడకుండా బందోబస్తు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డితో పోలీసులు మాట్లాడి...అక్కడి నుంచి వెళ్లేలా చేశారు. అనంతరం జిల్లా అధికారులు ఎంపీ ఎస్పీవై రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. వెలుగోడు జలాశయం నుంచి కొద్దిగా నీటిని విడుదల చేశామని అధికారులు ఆయనకు తెలిపారు. శాంతించిన ఎంపీ రేపు కర్నూల్ కి వెళ్లి అధికారులతో మాట్లాడతానని అక్కడి నుంచి వెళ్లిపోయారు.